విజయవాడ, జూలై 8,
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పశ్చిమ కష్ణాలోని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు, నూజివీడు ప్రాంతాల్లో సాగు చేసిన లక్ష ఎకరాల్లో పత్తి పంటకు జీవం పోసినట్లైందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నందిగామ, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు మండల పరిధిలో రైతులు ఈ ఏడాది మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. పొలాల్లో వేసిన విత్తనాలు మొలకెత్తి ఏపుగా పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ రెండో వారం నుండి రుతుపవనాల ప్రభావంతో తొలకరి ప్రారంభం కావడంతో నాటిన విత్తనాలు మొలిచి మొక్కలు పెరుగుతున్నాయి. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగమయ్యారు.మూడేళ్ల తర్వాత ఖరీఫ్ సీజన్‌లో సకాలంలో డెల్టా గ్రామాల్లోని పంట కా లువల్లో నీరు ప్రవహించడంతో రైతుల కళ్లలో సంతోషం కనపడుతోంది. సకాలంలో ఏలూరు కాలువకు నీరు విడుదల చేసిన ప్రభుత్వం. ఖరీఫ్‌లో 40 శాతం మాత్రమే కాలువకు నీరు విడుదల చేస్తే, మిగిలిన 60 శాతం వర్షాదారంగా సమకూరుతోందని ఇరిగేషన్ అధికారుల అంచనా. అయితేమారిన వాతావరణ పరిస్థితులల్లో గత మూడేళ్లుగా వర్షాలు సకాలంలో పడటం లేదు. దీంతో 80 శాతం నీటికి కాలువపైనే ఆధార పడాల్సి వచ్చింది. ఈ ఏడాది పూర్తి స్థాయిలో నీరు విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇపుడు నారుమళ్లు పోస్తేనే సకాలంలో నాట్లు పడి పంట కోతలసమయంలో తుఫాన్ భారిన పడకుండా ఉంటుందని రైతులు చెబుతున్నారు. డెల్టా గ్రామాలైన కేసరపల్లి, జక్కులనెక్కలం, సావరగూడెం, అజ్జంపూడి, బుద్దవరం, దావాజిగూడెం, అల్లాపురం గ్రామాల్లో 7,600 ఎకరాల్లో వరి సాగవుతోంది. గత మూడేళ్లుగా నీటి ఇబ్బందులు వచ్చినా తట్టుకుని సాగు చేపట్టారు. తుఫాన్ల ప్రభావం వల్ల రెండేళ్లు నష్టపోయారు. గతేడాది తుఫాన్ల తాకిడి లేకపోవడంతో పంట రైతుల చేతికి వచ్చింది. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడ్డారు. మిల్లర్ల వద్దకు ధాన్యం వెళ్లిన తర్వాత రేట్లు పెరిగాయి. దీనితో పాటే మార్కెట్‌లో బియ్యం రేట్లూ పెరగడంతో రైతులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ఈసారి సకాలంలో నీరు విడుదల చేయడంతో రైతులు నార్లుపోసేందుకు సిద్దమవుతున్నారు. ఆగస్టు వరకు నీరొస్తే నాట్లు పడతాయని, ఆతర్వాత వర్షాలు పడితే సాగుకు ఇబ్బందులు ఉండవని అంటున్నారు. ఒకవేళ వర్షం లేకుంటే కాలువ నీటిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ప్రభుత్వం పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణలోకితీసుకొచ్చి కాలువలకు నీరు వదిలిపెడుతోంది. దీంతో మెట్ల గ్రామాల్లో చెరువులకు నీరు పెట్టే పనిలో రైతులున్నారు.
గ్రామాల్లో లోపించిన పారిశుధ్యం మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా లోపించింది. రహదారులపై బురద నీరు చేరుకుంది. రహదారి ప్రక్కన డ్రెయిన్లు సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై చేరి దుర్వాసన వెదజల్లుతుంది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు.