కాకినాడ, జూలై 8,
జగన్ కి 2019 నాటికి ఉవ్వెత్తున రాజకీయ బలం ఎలా వచ్చింది. సామాజిక వర్గ సమీకరణల వల్ల. ఏపీలోని కులాలన్నీ కూడా మొత్తంగా ర్యాలీ అయి జగన్ కి ఓటు వేయడం వల్ల. ఆయనకు ఎన్నడూ కనీ వినీ ఎరుగని బంపర్ మెజారిటీ వచ్చింది. గోదావరి జిల్లాల్లోనే అది స్పష్టమయింది. అక్కడ కాపులకు, బీసీలకు కుదరదు, బీసీలు టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటే కాపులు కాంగ్రెస్ వైపు ఉండేవారు. మారిన పరిస్థితుల్లో 2014 నాటికి కాపులు టీడీపీకి మద్దతు ఇచ్చినా పూర్తిగా బదలాయింపు కాలేదు. అయితే 2019 నాటికి మాత్రం కాపులు, బీసీలు గుత్తమొత్తంగా జగన్ కి ఓటేశారు. అందుకే అటు టీడీపీకి బలమైన గోదావరి జిల్లాలు జారిపోయాయి. మరో వైపు తన కులంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పవన్ కల్యాణ‌్ కూడా ఏమీ కాకుండా పోయారు.ఇపుడు పవన్ కల్యాణ‌్ కి ఒక విషయం తెలిసివచ్చిందని అంటున్నారు. జనసేనకు తనకంటూ సొంత సామాజిక పునాది అవసరం అని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. 2019 నాటికి కూడా కాపుల మీదనే పవన్ ఆధారపడినా ఒక ముసుగు తొడుక్కున్నారు. తాను అందరి వాడిని అని భేషజాలకు పోయారు. ఇపుడు అలా కాదు, కాపులకు తానే తోడూ నీడా అంటున్నారు. వారికోసం ఉన్న పార్టీ జనసేన అని గట్టిగా చెప్పాలనుకుంటున్నారు. ఏపీ రాజకీయాల్లో చూస్తే ఈ పరిణామం చాల కీలకమైనదే. పవన్ కల్యాణ‌్ గ్లామర్ ఉన్న సినీ నటుడు, పైగా కాపు సామాజికవర్గం నేతగా ఫోకస్ అయితే ఏపీ రాజకీయాల్లో ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. కాపులు ఎటూ మళ్ళీ చంద్రబాబును నమ్మే స్థితిలో లేరు. దాంతో ఈ వైపు నుంచి పవన్ కల్యాణ‌్ ద్వారా బాబు రాజకీయ మంత్రాంగం నడిపిస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే కాపులకు రిజర్వేషన్లు జగన్ తొక్కిపెట్టారని పవన్ మండిపడడం అంటున్నారు.ఇక్కడే చంద్రబాబు రాజకీయ చాణక్యం ఉందని అంటున్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చి, దాని కోసం మంజునాధ కమిషన్ వేసి ఏదో చేసేసినట్లుగా మభ్యపెట్టి, ఈబీసీ కోటాలో అయిదు శాతం కాపులకు కేటాయించి మళ్ళీ వారికి మరేదో చేసేసినట్లుగా బాబు కలరింగ్ ఇచ్చినా కాపులు నమ్మలేదు. జగన్ పంచన చేరిపోయారు. ఇక కాపుల వైపు టీడీపీ ఉందని, తమ బీసీ రిజర్వేషన్లకు ఎసరు పెడుతోందని గట్టిగా నమ్మిక బీసీలు టీడీపీకి చరిత్రలో మొదటిసారిగా దూరమయ్యారు. దాంతో ఇపుడు కాపుల ఊసు బాహాటంగా ఎత్తడానికి బాబుకు భయమేస్తోంది. అందుకే తన పరోక్ష మిత్రుడు పవన్ కల్యాణ‌్ ద్వారా కాపులను ఎగదోసి తాను బీసీ పక్షపాతిగా ఉండాలనుకుంటున్నారుట.కాపులను పవన్ కల్యాణ‌్, బీసీలను చంద్రబాబు తమ వైపునకు తిప్పుకుంటే జగన్ సామాజిక, రాజకీయ సగానికి సగం పడిపోతుందని అంచనాలు ఉన్నాయి. జగన్ కి ఉత్త కోస్తా జిల్లాలు 2019 ఎన్నికల్లో కొమ్ము కాయడమే కాదు ఒక ఊపు ఊపేశాయి. అటువంటి ప్రభంజనం మళ్ళీ రాకుండా చూడాలంటే ఈ రాజకీయ ప్రయోగం చేయకతప్పదని చంద్రబాబు భావిస్తున్నారా అంటే అవును అనే సమాధానం వస్తోంది. అందుకే ఎన్నడూ లేనిది పవన్ కల్యాణ‌్ కాపులకు వత్తాసుగా పెద్ద నోరు చేఉకుంటున్నారు. అయితే ఇక్కడ జనాలను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు, ముద్రగడ పద్మనాభం కాపుల కోసం గట్టిగా పోరాడిన వేళ పవన్ కల్యాణ‌్ ఎక్కడ ఉన్నాడు అన్న ప్రశ్న వస్తుంది. హఠాత్తుగా వచ్చి కౌగలించుకుంటే కరిగిపోయి కాపులు జనసేనకు ఓటు చేస్తారనుకుంటే పొరపాటే. మరో వైపు కాపులతో పాటుగా మరో వైపు బీసీలకు జగన్ బాబు కంటే కూడా ఎక్కువ వరాలు ఇస్తున్నాడు. నామినేటెడ్ పదవుల నుంచి అన్నీ కట్టబెడుతున్నాడు. మరి కాపులూ, బీసీలు వాటిని వదిలి మళ్లీ పవన్ని బాబుని నమ్ముతారా అన్నది మరో ప్రశ్న. ఏది ఏమైనా రాజకీయాల్లో ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అందునా అక్కడ ఉన్నది చంద్రబాబు. సంక్షోభాల నుంచి సమాధానాలు వెతికే రకం. మొత్తం మీద ఏపీలో మారుతున్న సామాజిక పరిణామలు జగన్ కి ఒక సవాల్ అనుకోవాల్సిందే.