చాలా సందర్భాల్లో అవగాహనలోపం వల్ల అపార్థాలు కలుగుతుంటాయి. అంటే, చేసుకోవాల్సిన విధంగా కాక మరో రకంగా అర్థం చేసుకోవడం. దీనివల్ల మనస్పర్థలూ ఏర్పడుతుంటాయి.
కొంతమంది మనం ఏది మాట్లాడినా దాంట్లోంచి విపరీత అర్థాలు తీస్తారు. అవి వికృతంగా ఉంటాయి. మనల్ని బాధిస్తాయి. కానీ, అది వారి స్వభావం. మనం నిస్సహాయులం.
కొన్ని వ్యక్తీకరణలు సందర్భాన్నిబట్టి సొగసుగా, స్పష్టంగా అవతలివారికి తేలిగ్గా అర్థమయ్యేలా ఉంటాయి. అప్పుడు అపార్థాలకు అవకాశం ఉండదు. మన మనసులో అనుకున్న విషయాన్ని ఎలాంటి వక్రీకరణలు, కత్తిరింపులు లేకుండా చెప్పలేనప్పుడు, అది అపార్థాలకు దారి తీయకతప్పదు. తీరా అపార్థం చేసుకున్నాక ‘నా ఉద్దేశం అదికాదు’ అంటూ సుదీర్ఘ వివరణలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి అవసరం కలగకుండా మన వ్యక్తీకరణలను మనమే నియంత్రించుకోవాలి. అందుకు ఆత్మపరిశీలన అవసరం.
మనల్ని మనం పరిశీలించుకోవడమే ఆత్మపరిశీలన. చాలామంది ఈ విషయం పట్ల శ్రద్ధ చూపరు. ‘మనం తప్పు చేయం’ అనుకోకూడదు. మనమూ తప్పులు చేస్తాం అని గుర్తుంచుకోవాలి. అద్దంముందు నిలబడి అందాన్ని పరిశీలించుకుని, శరీరానికి మెరుగులు దిద్దుకుంటాం. అవసరమైన సవరణలు చేసుకుంటాం. ఇలాంటివే మన మాట, చేతకు అవసరం.
ఎవరికి వారు తమ లోపాలను గుర్తించలేకపోవచ్చు. కానీ, ఎదుటివారు వేలెత్తిచూపినప్పుడు ఆగ్రహించకుండా, తనను తాను తరచి చూసుకుతీరాలి. తనలోకి తాను తొంగి చూసుకోగలిగితే చాలు- దిద్దుబాటు తేలిక అవుతుంది.
ఎప్పుడూ మనవైపు నుంచే ఆలోచిస్తాం. ఎదుటివారివైపు నుంచీ ఆలోచించగలిగితే అది సదవగాహనకు దారితీస్తుంది. ముందు మనలో సానుకూల ధోరణిని పెంచుకోవాలి. ప్రతికూల భావాలను విసర్జించాలి.
ఏది చెప్పినా దాన్ని మంచిగా స్వీకరించడం, ఆచరించడం సానుకూల ధోరణి. మంచి చెప్పినా తిరస్కరించడం, వ్యతిరేకంగా వాదించడం, పనిని వాయిదా వెయ్యడం, అటు తరవాత చెయ్యకపోవడం ప్రతికూల వైఖరి. తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఆరోగ్యకరమైన సానుకూల ధోరణికి దోహదం చెయ్యాలి. గురువులు శిష్యులకు, శిక్షకులు సాధకులకు సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించాలి. అందుకు తగిన ఉపాయాలు పాటించాలి.
భక్తి విషయంలోనూ మన అవగాహన అసంపూర్ణం. ఎవరికి తోచినరీతిలో వారు భక్తిని నిర్వచించుకుంటారు. ఆచరణలో తమకు నచ్చిన విధానాన్ని పాటిస్తారు. కానీ, అది సరైన పద్ధతికి వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉందేమోనని సరిచూసుకోరు. దీనివల్ల, ఆశించిన ఫలితాలు దక్కవు.
భక్తి అంటే భగవంతుడితో అనుబంధం. భగవంతుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడో అర్థం చేసుకోకుండా, మనకు తోచినవన్నీ చెయ్యడం వ్యర్థం. దైవం మనకు అన్నీ ఇచ్చాడు. కానీ, ఇంకా మనం చాలాచాలా కోరుతుంటాం. భక్తి అనే ముసుగు వేసుకుని కోరికల జపం చేస్తుంటాం. దేహవిముక్తి అవుతున్నా కోరికల విముక్తి కలగదు.
మన మనసు బాల్యావస్థనుంచి బయటపడక పోవడం వల్లనే ప్రతి చిన్న విషయానికీ దైవం ముందు వాపోతాం. మనం ఆధ్యాత్మిక అవగాహన పెంచుకుంటే- స్థిరబుద్ధి, స్థిరభక్తి, అంతర్యామి అనుగ్రహం కలుగుతాయి.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో