విజయవాడ, జూలై 8,
డీపీలో యువ నేతల మధ్య తీవ్రమైన పోటీ సాగుతోంది. కీలకమైన పార్టీ పదవి కోసం రెండు జిల్లాలకు చెందిన యువ నాయకు లు నువ్వా-నేనా అనే రేంజ్‌లో పోటీ పడుతున్నారు. టీడీపీలో పార్టీ పరంగా యువతకు బాధ్యత వహించేందుకు జిల్లాల స్థాయిలో జిల్లా తెలుగు యువత అధ్యక్ష పదవులు ఉన్నాయి. అదే సమయంలో వీరికి తోడుగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర తెలుగు యువత అధ్య క్షుడు ఉంటారు. ఈ పదవిలో ఉన్నవారికి దాదాపు పార్టీలో అధ్యక్షుడితో సమానంగా గౌరవ మర్యాదలు అందుతాయి. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా.. రెడ్ కార్పెట్ స్వాగతాలు దక్కుతాయి. దీంతో ఈ పదవి దక్కించుకునేందుకు యువ నేతలు పోటీ పడతారు. రాష్ట్ర విభజన తర్వాత చాలా కాలం పాటు ఈ పదవి ఖాళీ గా ఉంది.ఈ క్రమంలోనే మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్‌కు గతంలో ఎన్నికలకు ముందు ఈ పదవిని అప్పగించారు. ఎన్నికల సమయంలో యువ నాయకుడిగా అవినాష్ రాష్ట్రం మొత్తం తిరిగి.. పార్టీ కోసం కృషి చేశారు. యువత కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను కూడా వివరించారు. అవినాష్ ఎన్నికలకు ముందు రాష్ట్రం అంతటా పర్యటించారు. ఎన్నికల్లో తాను స్వయంగా గుడివాడ నుంచి మంత్రి కొడాలి నానిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికలలో అవినాష్‌తో పాటు పార్టీ ఓడిపోయింది. దీంతో ఆరు మాసాల కిందట దేవినేని అవినాష్ పార్టీ మారిపోయారు. దీంతో ఈ పదవి అప్పటి నుంచి ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ పదవిని తమ వారసుడికి ఇవ్వాలంటూ.. ఇద్దరు నేతలు చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు.పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కుమారుడు ఈ రేసులో ముందున్నట్టుగా కొన్ని వార్తలు కొన్నాళ్ల కిందట హల్‌చల్ చేశాయి. ఎప్పటి నుంచో సరైన పార్టీ పదవి కోసం వెయిట్ చేస్తోన్న సదరు యువనేత ఈ పదవి కోసం భారీ ఎత్తున లాబీయింగ్ చేస్తున్నాడట. అయితే, అనంతపురం జిల్లాకు చెందిన దివంగత నాయకుడి కుమారుడు, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన యువ నాయకుడు కూడా ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఇరువురు యువ నేతల తరఫున చంద్రబాబు వద్దకు అర్జీలు కూడా వెళ్లాయని అంటున్నారు పరిశీలకులు.కానీ ఇప్పటి వరకు దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయమూ తీసు కోలేదు. ఇంకా కొన్నాళ్లు వేచి చూడాలని బాబు భావిస్తున్నట్టు చెబుతున్నారు. కానీ, స్థానిక ఎన్నికల్లో కూడా యువత సత్తా విషయంలో బాగా పనిచేసిన వారికి మాత్రమే ఈ పదవిని ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. ఈ పదవి విషయంలో చంద్రబాబు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ ఇద్దరు నేతలు కూడా జిల్లాల్లో దూకుడు ప్రదర్శించడం మానేశారు. ఫలితంగా యువ నాయకత్వం లేక.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ యువత సరైన దిశగా నడవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.