కోల్ కత్తా, జూలై 8,
ట్రాన్స్‌జెండర్‌కు కరోనా సోకడంతో ఆస్పత్రిలో ఆ వర్గానికి ప్రత్యేక బెడ్లు వసతులు ఏర్పాటు చేశారు. తద్వారా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దేశంలోనే ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ప్రభుత్వంగా ఘనత దక్కించుకుంది. కోల్‌కతాలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఆర్ బంగూర్ ఆస్పత్రిని ఇప్పటికే కొవిడ్-19 ఆస్పత్రిగా తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆస్పత్రిలోని మేల్, ఫిమేల్ వార్డుల్లో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేశారు. ఓ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న ట్రాన్స్‌జెండర్ కరోనా బారినపడటం ఈ ప్రత్యేక వసతి ఏర్పాటు చేయడానికి దారి కల్పించింది.ఓ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లో పని చేస్తున్న ట్రాన్స్‌జెండర్ రక్త నమూనాలు సేకరించే విధులు నిర్వహించారు. కరోనా సోకిన బాధితుడి నుంచి రక్త నమూనాలు సేకరించే క్రమంలో ఆమె వైరస్ బారినపడినట్లు భావిస్తున్నారు. ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెను ఎంఆర్ బంగూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె కోసం ప్రత్యేక బెడ్ ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక బెడ్లు కేటాయించిన ఆస్పత్రిగా ఇది వార్తల్లోకెక్కింది.ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక బెడ్లు కేటాయించిన ఘనత సీఎం మమతా బెనర్జీకే దక్కుతుందని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చంద్రిమ భట్టాచార్య పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను సీఎం ముందు ఉంచినప్పుడు ఆమె వెంటనే ఆమోదించారని తెలిపారు.ట్రాన్స్‌జెండర్ల పట్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉదార స్వభావాన్ని చాటుకుందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఎన్నో ఏళ్లుగా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నా.. ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రభుత్వాలు చాలా తక్కువే చేస్తున్నాయి. మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఓ మైలురాయిగా నిలిచిపోతుంది’ అని రంజిత్ సిన్హా పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం బెంగాల్‌లో ఆయన ఓ సంస్థను నిర్వహిస్తున్నారు.