YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ప్రైవేట్ పాఠాలు

ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ప్రైవేట్ పాఠాలు

మెదక్, జూలై 8, 
కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పదో తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేసింది. ఇంకా మిగిలిన వాటిని ఏం చేయాలా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియడం లేదు. ఈ క్రమంలో జిల్లాలోని పలు ప్రయివేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి. ఓ వైపు విద్యాశాఖ ఇలాంటి విధానాన్ని చేపట్టవద్దని సూచిస్తుండగా, మరోవైపు ప్రయివేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ ద్వారా విద్యాబోధన చేస్తున్నాయి. దీంతో పలువురు విద్యార్థులు సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చొని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను వింటున్నారు. ఆన్‌లైన్‌ తరగతుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం.జూన్‌ 12వ తేదీ నుంచి అన్ని పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నా కరోనాతో నేటికీ తెరుచుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులూ సుముఖంగా లేరు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాల సరఫరా పూర్తయినా బడి గంట ఎప్పుడు మోగుతుందో సందిగ్ధంగానే మారింది. మరోవైపు కొత్త విద్యా సంవత్సరంలో బాలల ప్రవేశాలపై అన్ని పాఠశాలల ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలోని పలు ప్రయివేటు పాఠశాలలు మాత్రం విద్యార్థుల ప్రవేశాలను చేపట్టాయి. ఇదే అదనుగా ప్రభుత్వ గుర్తింపు లేకుండా ఏర్పాటవుతున్న పాఠశాలలు కూడా బాలలకు ప్రవేశాలు కల్పిస్తున్నాయని విద్యార్థి సంఘాల బాధ్యులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. పలు ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు ఇంట్లోనే పాఠాలను వింటున్నారు. విద్యార్థుల సంఖ్యను కాపాడుకోవడం కోసం పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి. జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 1347 ఉండగా వాటిల్లో లక్షకు పైగా మంది విద్యార్థులు, ప్రయివేటు పాఠశాలలు 2200 వరకు ఉన్న పాఠశాలల్లో సుమారు లక్షా 50వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ బడులకు తాళాలు వేసే ఉంటున్నాయి. పలు ప్రయివేటు పాఠశాలలు మాత్రం ఆన్‌లైన్‌ తరగతులతో ఉదయం పూట విద్యార్థులను పాఠాలను బోధిస్తున్నాయి. వాట్సప్‌ల ద్వారా ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాల వీడియోలను విద్యార్థులకు పంపిస్తూ వాటిపై హోంవర్కు ఇస్తున్నారు. మరికొన్ని బడులు జూమ్‌యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులను బోధిస్తున్నారు. ఏ రోజు ఏ పాఠ్యాంశం బోధన ఉంటుందనే విషయాన్ని విద్యార్థులకు సంబంధించిన మొబైల్‌కు సమాచారాన్ని అందిస్తున్నారంటే ప్రయివేటు విద్యావ్యవస్థ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వపాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇలాంటి ఆదేశాలు రాకపోవడంతో వారు విద్యకు దూరమువుతన్నారని చెప్పారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పిల్లలకు బడులకు వెళ్లినట్లుగానే తయారై మొబైల్‌, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌ల ముందు కూర్చుంటున్నారు. పలు ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులు ముందుగానే ఈ తరగతులకు సంబంధించిన నోట్స్‌ తయారు చేసి ప్రిన్సిపళ్లకు అందించి వారి సూచనల మేరకు వాటిని ఆన్‌లైన్‌ ద్వారా ఇంటి నుంచి లేదా పాఠశాలల నుంచి బోధిస్తున్నారు. వాటిపై స్లిప్‌టెస్ట్‌లు లాంటివి కూడా ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహిస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో ఫీజులు వసూలు కాకపోవడంతో కొన్ని పాఠశాలలు ఈ విధానంతో వాటిని వసూలు చేసుకునేలా ముందుకు వస్తున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులకు పెండింగ్‌ ఫీజులను చెల్లించాలని సందేశాలను పంపిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ మాత్రం ఎలాంటి ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించవద్దని సూచిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఈ విధానం చాలా మేరకు అమలవుతున్నా గ్రామీణ, మండల కేంద్రాల్లోని బడుల్లో తక్కువగానే నిలుస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లు, నెట్‌ సౌకర్యం లేకపోవడం, నెట్‌ స్పీడ్‌ తక్కువగా ఉండటం వంటి సమస్యలతో పలువురు విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు దూరంగా నిలుస్తున్నారు.

Related Posts