కర్నూలు, జూలై 9,
కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది. తొలికరి తర్వాత వర్షాలు కురుస్తుండటంతో స్థానికులంతా వజ్రాల వేటలో బిజీ అయ్యారు. ఒక్క వజ్రం దొరికితే చాలు లక్షాదికారి అవ్వొచ్చనే ఆశతో గాలింపు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరికి వజ్రాలు దొరికాయి. తాజాగా తుగ్గలి మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన ఓ మహిళా కూలీకి వజ్రం దొరికినట్లు తెలుస్తోంది.ఆ మహిళ పొలంలో వేరుశనగ విత్తనం విత్తేందుకు వెళ్లింది. పొలంలో విత్తనాలు విత్తే సమయంలో వజ్రం ఆమె కంట పడడంతో ఆగి తీసుకుంది. 5 క్యారెట్లకు పైగా ఉన్న ఈ వజ్రాన్ని అదే రోజు రాత్రి అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ వ్యాపారి రూ.5.50 లక్షల నగదు, 3తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరవాలు తెలియాల్సి ఉంది. ప్రతి ఏటా తొలకరి తర్వాత అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వజ్రాల వేట ప్రారంభమవుతుంది. స్థానికులు పొలాల్లో వజ్రాల వేటలో బిజీ అవుతున్నారు. ఇటీవల అనంతపురం జిల్లాలో కూడా ఖరీదైన వజ్రం దొరికగా.. ఓ వ్యాపారికి అమ్మినట్లు తేలింది. పోలీసులు కూడా ఈ వ్యవహారంపై ఆరా తీశారు.