YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

వేసవి నాటికి 20 కోట్ల మందికి కరోనా... భయపెడుతున్న నివేదిక...

వేసవి నాటికి 20 కోట్ల మందికి కరోనా... భయపెడుతున్న నివేదిక...

న్యూఢిల్లీ, జూలై 9, 
దేశంలో శరవేగంగా కరోనా వ్యాప్తి చెందుతోంది. ప్రతి రోజూ ఇరవై వేలకు పైచిలుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడ రోజూ నాలుగొందలకు తక్కువ కాకుండా ఉంటోంది. వచ్చే ఏడాది వేసవి నాటికి కూడా కరోనాకు ఔషధం కనిపెట్టకపోతే మార్చి-మే సమయానికి ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది ఆ వైరస్‌ బారిన పడే ప్రమాదముందని అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) పరిశోధకులు పేర్కొన్నారు. 84 దేశాల్లో 60 శాతం ప్రపంచ జనాభాపై నిర్వహించిన పరీక్షల సమాచారాన్ని క్రోడీకరించి వారు ఒక నివేదికను తయారుచేశారు. దాని ప్రకారం.. వచ్చే ఏడాది కరోనా అత్యధికంగా సోకే దేశాల్లో తొలిస్థానం భారత్‌దే. తర్వాతి స్థానాల్లో అమెరికా, దక్షిణాఫ్రికా, ఇరాన్‌, ఇండోనేషియా, యూకే, నైజీరియా, టర్కీ, ఫ్రాన్స్‌, జర్మనీ ఉన్నాయి. భారత్‌లో రోజూ 2.87 లక్షల మందికి సోకే స్థాయికి కరోనా చేరుకుంటుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అయితే.. వైరస్‌ కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే కేసులు తగ్గుతాయన్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 22,752 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 482 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మహారాష్ట్రలోనే 5,134మందికి కొత్తగా పాజిటివ్‌ నిర్ధారణకాగా, 224మందిమ మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 7,42,417 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకగా, 20,642 మంది మృతిచెందారు 2,64,944 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 4,56,831 మంది కోలుకొని ఇంటికి వెళ్లినట్లు కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.భారత్‌‌లో కోవిడ్‌ కేసులు 6 లక్షలు దాటిన కేవలం అయిదు రోజుల్లోనే 7 లక్షల సంఖ్యను దాటేశాయి. ఒక్కరోజులోనే 22,252 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 7,19,665కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో మరో 467 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య  20,160కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అయిదు రోజులుగా వరుసగా రోజుకు 20 వేలకు పైగా కొత్త కేసులు బయటపడుతున్న సంగతి తెలిసిందే. 1 నుంచి లక్ష కేసులు చేరుకోవడానికి 110 రోజులు పట్టగా అక్కడి నుంచి 7 లక్షలకు కేవలం 49 రోజుల సమయం మాత్రమే తీసుకుంది. ఇప్పటి వరకూ 61.13 శాతం మంది రోగులు కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం వరకు మొత్తం 1,02,11,092 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపారు.24 గంటల్లో మొత్తం 467 మరణాలు సంభవించగా అందులో అత్యధికంగా మహారాష్ట్రలో 204, తమిళనాడులో 61, ఢిల్లీలో 48, కర్ణాటకలో 29, ఉత్తరప్రదేశ్‌లో 24, పశ్చిమబెంగాల్‌లో 22, గుజరాత్‌లో 17 తెలంగాణలో 11, ఆంధ్రప్రదేశ్‌లో 7 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా అత్యధిక మరణాల్లో సైతం 9 వేలకు పైగా మరణాలతో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా, ఢిల్లీలో 3,115, గుజరాత్‌లో 1,960, తమిళనాడులో 1,571, ఉత్తరప్రదేశ్‌లో 809 మరణాలు సంభవించాయి. అత్యధిక కేసుల విషయంలో మహారాష్ట్ర ముందుండగా తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌ ఉన్నాయి.
కరోనా మహమ్మారి తమిళనాడును కలవరపెడుతోంది. రోజులు గుడుస్తున్న కొద్ది రాష్ట్రంలో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడులో గత 24 గంటల్లో 3,756 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. 64 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,22,350కు చేరుకోగా.. కరోనాతో పోరాడి ప్రాణాలు వదిలిన వారి సంఖ్య 1,700కు చేరుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు బుధవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కాగా.. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల్లో 46,480 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 74,167 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా వైరస్‌ను అదుపుచేసే పరిస్థితులు చేజారిపోయాయా? సాధారణ వ్యాప్తిని దాటిపోయి సామూహిక వ్యాప్తి దశకు చేరుకుందా? అంటే అవునని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
భారత్‌లో కరోనా మరణాలు తక్కువే.. కేంద్ర ఆరోగ్య శాఖ  కాగా, ప్రపంచంతో పోలిస్తే భారత్‌లోనే కరోనా కేసులు, కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది.  ప్రపంచంలో ప్రతి పది లక్షల మందిలో 1,453.25 మందికి కరోనా సోకుతుండగా, అది భారత్‌లో 505.37గా ఉంది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మందికి 68.29 మంది కరోనాతో చనిపోతుండగా, భారత్‌లో అది 14.27గా ఉంది. ఈ సంఖ్య యూకేలో 651.4, మెక్సికోలో 235.5గా ఉంది. కరోనా మృతుల్లో మన దేశం 8వ స్థానంలో ఉంది. పాజిటివ్‌ కేసుల నమోదులో 3వ స్థానంలో ఉంది. మన దేశంలో కరోనా కట్టడికి వైద్య సేవలను విస్తృతం చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 1,115 కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాలతోపాటు ఆస్పత్రుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచినట్లు తెలిపింది. 1,201 కొవిడ్‌ ఆస్పత్రులు, 2,611 కొవిడ్‌ ఆరోగ్య కేంద్రాలు, 9,909 కొవిడ్‌ సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నది.దేశంలో మహరాష్ట్ర తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, హరియాణా రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గుజరాత్‌ మంత్రి రమణ్‌ పట్కర్‌కు కరోనా సోకింది. గుజరాత్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్రమంత్రి భరత్‌ సింగ్‌ సోలంకి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆస్పత్రిలో చేరారు. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇటీవల తనను కలిసిన మంత్రి మితిలేశ్‌ ఠాకూర్‌కు పాజిటివ్‌ అని తేలడంతో ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లో ఉంటున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. జేఎంఎం ఎమ్మెల్యే మథురా మహతోకు పాజిటివ్‌ రావడంతో ప్రభుత్వ నిర్వహిస్తున్న కొవిడ్‌ ఆస్పత్రిలో చేరారు. కర్ణాటకలో ఒక్క రోజే 2062 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసు ల సంఖ్య 28,877కి చేరగా.. 470 మంది చనిపోయా రు. ఇక తమిళనాడులో కరోనా కేసులు 1.22 లక్షలు దాటాయి. రాష్ట్రవ్యాప్తంగా 64 మంది మృతి చెందారు.

Related Posts