అమరావతి జూలై 9
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రైతు దినోత్సవంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది జగన్ ప్రభుత్వం 20వేల కోట్లకు పైగా బడ్జెట్‌లో పెట్టి 37శాతం మాత్రమే ఖర్చుపెట్టి.. 63శాతం నిరూపయోగం చేసిందని వ్యాఖ్యానించారు. రూ.20వేల కోట్ల బడ్జెట్‌లో కేవలం రూ.7వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి రైతు దినోత్సవం అనటం విడ్డూరంగా ఉందని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. రెండో ఏడాదీ 22వేల కోట్లు బడ్జెట్‌లో వ్యవసాయానికి పెట్టారన్నారు. ఆ మిగిలిన డబ్బులన్నీ ఖర్చు చేసి చూపించాలని మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన ఎన్నో ప్రాథమిక కార్యక్రమాలు నిలిపివేశారన్నారు. ముఖ్యంగా భూసార పరీక్షలు నిలిపివేయడం ఎంత వరకు సబబు అని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఉద్యాన పంటలకు ఉపకరించే సూక్ష్మ సేద్యం, బిందు, తుంపర సేద్యాలను ఈ ప్రభుత్వం పక్కనపెట్టేసిందన్నారు. ప్రకృతి సేద్యాన్ని నిరూపయోగం చేసిందని మండిపడ్డారు. విత్తనాలు సరఫరాలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు.