అమరావతి జూలై 9
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు నిధుల సమీకరణపై సీఎం సమీక్ష నిధుల సమీకరణపై కచ్చితమైన ప్రణాళిక ఉండాలి
ఎట్టి పరిస్థితుల్లోనూ పనులకు ఆటంకం కలగకూడదు అధికారులకు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాడు–నేడు, సాగునీటి ప్రాజెక్టులు, వాటర్గ్రిడ్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు నిధుల అనుసంధానంపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్ష చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న వీటి విషయంలో ఎక్కడా నిధులకు కొరత రాకుండా పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. నిధుల అనుసంధానంపై నిర్దిష్ట సమయంతో లక్ష్యాలను పెట్టుకుని కచ్చితమైన ప్రణాళికతో అడుగులు ముందుకేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రాధాన్యతలుగా నిర్దేశించిన వివిధ శాఖల్లో చేపట్టిన కార్యక్రమాల పురోగతి, వాటికి చేస్తున్న ఖర్చు, సమీకరించాల్సిన నిధులు విషయంలో సీఎం అధికారులతో సమగ్రంగా సమీక్ష చేశారు. ముఖ్యమంతి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఆర్థిక, విద్య, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బి, జలవనరులశాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
విద్యా రంగంలో నాడు–నేడుపై సీఎం సమీక్ష:
విద్యా రంగంలో చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష చేశారు. ఇప్పటి వరకూ విడుదల చేసిన నిధులు, ఇకపై సమీకరించాల్సిన నిధుల అంశాలపై సీఎం అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మొదటి విడత నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 15 వేలకు పైగా స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, దీని కోసం దాదాపు రూ.3600 కోట్లు ఖర్చు అవుతుందని, ఇప్పటికి రూ.920 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. మిగిలిన నిధుల విడుదల కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 కల్లా మొదటి విడత నాడు–నేడు కార్యక్రమాలకు మిగిలిన నిధులు ఇచ్చేందుకు ప్రణాళిక వేసుకోవాలన్నారు.
అలాగే పాఠశాలలు సహా, హాస్టళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో రెండు, మూడో విడత నాడు–నేడు కార్యక్రమాల కోసం రూ.7700 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశామని అధికారులు సీఎంకు తెలిపారు.
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న పాఠశాలలు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాలకు.. నిధుల పరంగా ఇబ్బందులు రాకుండా, పటిష్టంగా ఈ కార్యక్రమం కొనసాగాలని సీఎం ఆదేశించారు. రెండు, మూడో విడత పనుల కోసం ఖర్చయ్యే రూ.7700 కోట్ల నిధుల విషయంలో ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలన్నారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో అన్ని స్కూళ్లలో నాడు–నేడు కార్యక్రమాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని, ఏడాదిన్నర కాలంలో పాఠశాలల అభివృద్ధి విషయంలో మనం కన్న కలలు నిజం కావాలని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.