YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీ బీజేపీ తప్పటడుగులు

ఏపీ బీజేపీ తప్పటడుగులు

విజయవాడ, జూలై 10,
బీజేపీ ఎంతకాలం గాలిలో మేడలు కడుతుందో మరి. ఇంకెంతకాలం నేల విడిచి సాము చేస్తుందో మరి. ఏపీ భౌగోళిక, సామాజిక, రాజకీయ పరిస్థితి మీద బీజేపీకి బాగానే ఎరుక ఉంది. ఇక్కడ ప్రాంతాల మధ్య తేడాలు ఉన్నాయి. కులాభిమానాలు ఉన్నాయి. కుటుంబ అభిమానాలూ ఉన్నాయి. వీటిని కాదని కొత్త రాజకీయం చేయాలని బీజేపీ నిజంగా అనుకుంటోందా. ఆచరణలో అడుగు కూడా ముందుకు వేయలేని బీజేపీ మాటలు మాత్రం కోటలు దాటిస్తోంది. తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్టీ క్యాడర్ వర్చువల్ మీట్ లో ఏపీ రాజకీయాలపైన చేసిన కామెంట్స్ చూస్తే ఈ బీజేపీ చెప్పేవన్నీ నేతి బీరకాయ నీతులేననిపించకమానదు.ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పదవి నుంచి ఆదరాబాదరాగా హరిబాబుని దించేసి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చి అక్కడ నచ్చక వైసీపీ వైపుగా లగెత్తాలని పెట్టేబేడా సర్దేసుకుంటున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఎందుకు ఏపీ ప్రెసిడెంట్ చేశారో బీజేపీకి తెలియదా. అది కూడా ఎన్నికలకు ముందు కాపు కార్డు కోసమే కదా. ఆ ఓట్లు గుత్తమొత్తంగా పొందాలన్న దురాశతోనే కదా. ఇక కోస్తాలో బలమైన కమ్మ కులానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మీద ఎన్నో ఆర్ధిక లావాదేవీల్లో ఆరోపణలు ఉన్నా ఎందుకు బీజేపీ కండువా కప్పాల్సివచ్చిందో కమలం పెద్దలు పెదవి విప్పి చెప్పగలరా. చంద్రబాబుతో దోస్తీ చేసినపుడు ఆయన ఎన్టీయార్ అల్లుడని, రాజకీయ వారసుడని, టీడీపీ కుటుంబ పార్టీ అని అనిపించలేదా కనిపించలేదా?ఇపుడు మాత్రం బీజేపీ పెద్దలు ఏపీ జనానికి నీతులు చెబుతున్నారు. అక్కడికి ఏపీ ప్రజలకు ఏమీ తెలియదు అనుకుంటున్నారు. బీజేపీకి ప్రాంతాలు లేవు, కులాలు లేవు, కుటుంబాలు లేవు, అవినీతికి దూరం అనుకున్నపుడు సుజనాలు, కన్నాలు ఎక్కడ నుంచి వచ్చారో చెప్పగలరా. ఇక బీజేపీకి ఏపీలో సరైన పునాది లేదు, ఈ మాట అనడం కంటే తన సిధ్ధాంతాలను తానే గౌరవించుకోదు అనడం సబబు. ఏపీలో బీజేపీకి బ్రాహ్మణులు, వైశ్యులు, కాపులు ప్రధాన మద్దతుదారులు. మరి వీరి నుంచి ఎవరికైనా పెద్ద పదవులు ఆ పార్టీ కట్టబెట్టిందా. అయారాం గయారాంలను తప్ప మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న సోము వీర్రాజు లాంటి వారికి అధ్యక్ష పదవులు ఇచ్చిందా. అంటే బీజేపీవి ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప అమలులో మాత్రం ఆవగిజంత అడుగు పడదని అర్ధమైపోతోందిగా.ఇక అవినీతి ఏపీలో జరుగుతోంది అని గావు కేకలు పెడుతున్న బీజేపీ పెద్దలు ఆరేళ్ళుగా కేంద్రంలో తామే ఉన్నారుగా, చంద్రబాబుకు పోలవరం ఏటీఎం కార్డు అన్న ప్రధాని మోడీయే ఆ మాట మరచిపోయారు. ఇక వీలు అయితే మళ్ళీ 2024 నాటికి బాబుతో పొత్తులు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు, ఇక సుజనా చౌదరి బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టాడని అవినీతి ఆరోపణలు ఉంటే ఇప్పటికి చర్యలు లేవు సరికదా ఆయన్ని ఏపీ బీజేపీ పెద్దగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కులాల కంపు అంటూనే కాపుల ఓట్ల కోసం పవన్ని, కన్నాను ఎంచుకుని ముందుకు సాగుతున్నారు. మరి ఇన్ని అవలక్షణాలూ తమ వద్దనే ఉంచుకుని పెద్ద మాటలు మాట్లాడితే ఏపీలో పార్టీకి ఓట్లు పడతాయా, ఎదుగుదల ఉంటుందా. ఇలా ఎప్పటికపుడు లాజిక్ మిస్ అవుతూ రంకెలు వేయబట్టే బీజేపీకి ఇపుడు 2024 లో కూడా ఆశలు అడుగంటాయని ముందే జోస్యాలు చెప్పేస్తున్నారు.

Related Posts