YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

యడ్డీకి అసమ్మతి సెగ

యడ్డీకి అసమ్మతి సెగ

బెంగళూర్, జూలై 10, 
ర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అసమ్మతి సెగ తప్పేట్లు లేదు. ఆయనంటే పడని కొందరు సీనియర్ నేతలు ఒకవర్గంగా మారుతున్నారు. యడ్యూరప్పను పదవి నుంచి దించే లక్ష్యంగా అసమ్మతి నేతలు వేగాన్ని పెంచినట్లు తెలుస్తోంది. యడ్యూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్ర వైఖరిని ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు పార్టీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోక పోవడంతో నేరుగా కార్యచరణను సిద్ధం చేసినట్లు కన్పిస్తుంది.కర్ణాటక ముఖ్యమంత్రిగా ‍యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన దాదాపు ఎనిమిది నెలలు పైగానే అవుతుంది. ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి కాగలిగారు. దీంతో పదిహేను స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పన్నెండు మందిని యడ్యూరప్ప గెలిపించుకున్నారు. దీంతో ఆయన పూర్తికాలం పదవీలో కొనసాగే వీలు చిక్కింది. పార్టీ హైకమాండ్ కూడా యడ్యూరప్ప పై పూర్తి స్థాయి నమ్మకాన్ని కనబర్చింది.యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రివర్గాన్ని రెండు దఫాలు విస్తరించారు. అయితే మలి విడత మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు దక్కాయి. బీజేపీలో సుదీర్ఘకాలం నుంచి ఉంటున్న వారికి పదవులు దక్కలేదు. దీంతో సీనియర్ నేతలు యడ్యూరప్ప పై గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర జోక్యం పాలనలో పెరగడాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు.దీంతో కొందరు సీనియర్ నేతలు రహస్య సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల కాఫీనాడు రిసార్ట్స్ లో కొందరు సీనియర్ నేతలు సమావేశమయ్యారు. బీజేపీ నేతలు ఆర్ అశోక్, సీటీ రవి, జగదీశ్ శెట్టర్, ఈశ్వరప్పలతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరోవైపు పార్టీ సీనియర్ నేత బసన్న గౌడ పాటిల్ కూడా ఎమ్మెల్యేలతో రహస్య సమావేశాలను నిర్వహిస్తూ యడ్యూరప్పకు వ్యతిరేకంగా మద్దతును కూడగడుతున్నారు. అయితే దీనికి విరుగుడుగా యడ్యూరప్ప తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆరుగురు మంత్రులపై వేటు వేయాలని సిద్దమయ్యారు. అయితే అధిష్టానం వారించడంతో ఆయన మిన్నకుండి పోయారు. త్వరలో ఢిల్లీ నుంచి పెద్దలు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడంతో పరిస్థితి గుంభనంగా ఉంది.

Related Posts