హైద్రాబాద్, జూలై 10,
కరోనా వైరస్ ప్రభావంతో అన్ని రంగాలూ తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ప్రయివేట్ స్కూళ్లు, హోటళ్లు, పర్యాటక కేంద్రాలు.. ఇలా అన్ని ఉపాధికి ఊతం ఇచ్చే అనేక రంగాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా నిరుద్యోగం భారీగా పెరిగింది. జూన్ నెలలో తెలంగాణలో నిరుద్యోగ రేటు (15.5 శాతం) జాతీయ సగటు 10.99ను దాటిపోయింది. లాక్‌డౌన్ ముందుతో పోలిస్తే.. దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు భారీగా ఉండటం కలవరానికి గురి చేస్తోంది.మే నెలలో జాతీయ నిరుద్యోగ రేటు 23.5 శాతం ఉండగా.. అది మే నెలలో 11 శాతానికి పడిపోయింది. కానీ లాక్‌డౌన్ కంటే ముందు జాతీయ నిరుద్యోగ రేటు 8 శాతమేనని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) స్పష్టం చేసింది. 2017-18లో జాతీయ నిరుద్యోగ సగటు 4.6 శాతం మాత్రమే కావడం గమనార్హం.లాక్‌డౌన్ ప్రభావంతో మే నెలలో జాతీయ నిరుద్యోగ రేటు ఏకంగా 23.5 శాతానికి చేరింది. ఇదే కాలానికి తెలంగాణలో నిరుద్యోగ రేటు 34.8 శాతానికి చేరడం గమనార్హం. జూన్ నెలలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడం, గ్రామీణ ప్రాంతాల్లో పనులు ప్రారంభం కావడంతో నిరుద్యోగ రేటు తగ్గింది.దక్షిణాదిలో కేరళలో నిరుద్యోగ రేటు (20.1 శాతం) ఎక్కువగా ఉండగా.. తెలంగాణ తర్వాతి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా హర్యానాలో నిరుద్యోగ సగటు (33.6) శాతం ఉండగా.. తెలంగాణ 9వ స్థానంలో ఉంది.