YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

పల్లెకు చేరిన కరోనా

పల్లెకు చేరిన కరోనా

వరంగల్, జూలై 10, 
లాక్‌డౌన్‌ సడలింపులే.. పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నగరాల నుంచి జిల్లాలు.. గ్రామాల్లోనూ పెచ్చరిల్లుతోంది. సడలింపుల్లో పరీక్షలు చేయకపోవడమూ ఒకటి. ముందుగా వలస కార్మికుల తిరుగుముఖం.. ఆ తర్వాత రాష్ట్ర రాజధాని నుంచి రాకపోకల వల్ల.. జిల్లాల్లో రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరగడానికి కారణమైంది. మొదట్లో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి ద్వారా అక్కడక్కడా కేసులు వచ్చినా.. ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో తగ్గుముఖం పట్టింది. దాంతో పల్లెవాసులు కొంత ఊపిరిపీల్చుకునేలోపే వలసెళ్లిన కార్మికులు తిరిగి వచ్చారు. అయితే, వారికి కనీసం పరీక్షలు చేయకుండా అధికారులు గ్రామాల్లో వదిలేశారు. ముఖ్యంగా ముంబయి, గుజరాత్‌, పూణే, గుంటూరు, కర్నూలు లాంటి కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులను కనీసం హౌంక్వారంటైన్‌ చేయలేదు. ఆ తరువాత లాక్‌డౌన్‌ సడలింపుల వల్ల హైదరాబాద్‌ నుంచి రాకపోకలు పెరిగాయి. దాంతో హైదరాబాద్‌లో తీవ్రంగా ఉన్న కరోనా.. ప్రయాణాల వల్ల జిల్లాలకు పాకి... కేసులు పెరగడానికి కారణమైంది.లాక్‌డౌన్‌ సడలింపుకు ముందు నల్లగొండలో 17, సూర్యాపేటలో 83 పాజిటివ్‌ కేసులు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 361 కేసులకు పెరిగాయి. మొదట్లో ఒక్క కేసూ లేని యాదాద్రి భువనగిరిలోనూ ప్రస్తుతం 102 కేసులు ఉన్నాయి. నల్లగొండ, యాదాద్రిభువనగిరి జిల్లాలకు సంబందించిన ఉద్యోగులు 80శాతానికిపైగా హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వీరి నుంచి కూడా కరోనా ముప్పు జిల్లాకు వాటిల్లింది. ఉదాహరణకు: యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ రామంతాపూర్‌ నుంచి వచ్చి వెళ్లేవారు. ఆయనకు పాజిటివ్‌ రావడంతో, ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న మరో కానిస్టేబుల్‌కు కూడా ప్రబలింది. నల్లగొండ ఎస్‌బీఐ బ్యాంకు ఉద్యోగి సైతం హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగించడంతో స్థానికంగా మరికొందరికి వైరస్‌ వచ్చింది. ఇలా ఉమ్మడి జిల్లాలో 50కి పైగా కేసులు హైదరాబాద్‌ కాంటాక్ట్‌ ఉన్నాయి.
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇప్పటివరకు 350పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 16 మంది మరణించారు. అత్యధికంగా కరీంనగర్‌లోనే 176 నమోదు కాగా, తరువాత 95 పాజిటివ్‌ కేసులతో జగిత్యాల ఉంది. పెద్దపల్లిలో 56, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 46 కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ సడలింపులు మొదలయ్యాక అధికార యంత్రాంగం కాడి వదిలేయడంతో వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. మరోవైపు అధికారపార్టీ ఎమ్మెల్యేలతోపాటు కరీంనగర్‌ మున్సిపల్‌ ముఖ్యనేత భర్తకూ ప్రబలడం కలకలం రేపింది. వారితో కాంట్రాక్ట్‌ అయిన ప్రభుత్వంలోని కీలక నేత సహా పలువురు కార్పొరేటర్లు ఐసోలేషన్‌ అయ్యారు.
హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో అధికంగా కేసులు నమోదవుతున్న తరుణంలో, దాని పరిధిలోనే ఉన్న రంగారెడ్డి జిల్లాలోనూ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 176కేసులు వచ్చాయి. నాన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో నగరం నుంచి పల్లెలకు వస్తున్న వారితో కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 361 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారితో పాటు స్థానికంగా ఫంక్షన్లలో పాల్గొనటం ద్వారా పాజిటివ్‌ కేసులు పెరిగాయి.
లాక్‌ డౌన్‌ సమయంలో ఖమ్మంలో 8 కేసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు కేసులే ఉండగా.. ఆ తరువాత గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌ నుంచి వచ్చిన కార్మికుల ద్వారా పెరిగాయి. ప్రస్తుతం కరోనా కేసులు ఖమ్మం 112, భద్రాద్రి 59కి చేరాయి. ఖమ్మంలో కాంగ్రెస్‌ తలపెట్టిన జలదీక్షకు వచ్చిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వి.హనుమంతరావు వచ్చారు. ఆయనకు దగ్గరగా ఉన్న కొందరికి వైరస్‌ అంటుకుని ఐదుగురికి పాకింది. ఇంకా కేసులు బయటపడుతున్నాయి.ప్రస్తుతం పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటిని మాత్రమే కంటైన్మెంట్‌గా ప్రకటిస్తున్నారు. లక్షణాలు కలిగిన వారికి మాత్రమే పరీక్షలు అని ప్రకటించడం కూడా కేసులు పెరగడానికి కారణమైంది. సూర్యాపేట మార్కెట్‌లో లక్షణాలు లేని 34 మందికి పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌లో ప్రయివేటు ల్యాబుల్లో పరీక్షలు చేయించుకుని పాజిటివ్‌ తేలిన వారు కొందరు బయట తిరుగుతున్నారు.ఉమ్మడి వరంగల్‌లో కేసుల సంఖ్య 500కు చేరువలో ఉంది. వరంగల్‌ అర్బన్‌ జిలాలోనే డబుల్‌ సెంచరీ నమోదు చేసింది. వరంగల్‌ రూరల్‌లో 15 రోజుల ముందు 7 కేసులు ఉండగా, ఇప్పుడు 50కి పైగా పెరిగింది. అర్బన్‌ జిల్లాలో 33 కేసులు ఉండగా, ఇప్పుడు రెండు వందలకు పెరిగాయి. జనగామలో ఒక్క ఫర్టిలైజర్‌ షాపు ద్వారానే 74మందికి కరోనా ప్రబలింది. కామారెడ్డి జిల్లాలో మొత్తం 96 కేసులు నమోదయ్యాయి. అన్‌లాక్‌కు ముందు సింగిల్‌ డిజిట్‌లో ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం ఏకంగా 96కు పెరిగింది. కామారెడ్డిలో జరిగిన ఓ విందుతో పాటు హైదరాబాద్‌ నుంచి వచ్చిన లింకులే ఎక్కువ.

Related Posts