YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మూడు సీట్లు...30 మంది ఆశావహులు

మూడు సీట్లు...30 మంది ఆశావహులు

హైద్రాబాద్, జూలై 10, 
తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ లో శాసనమండలి స్థానాల భర్తీ చర్చనీయాంశంగా మారింది. శాసనమండలిలో మొత్తం మూడు శాసనమండలి స్థానాలు ఖాళీ అవుతున్నాయి. గవర్నర్ కోటాలో భర్తీ చేసే ఈ స్థానాలను కేసీఆర్ ఎవరి పేరుపై టిక్ పెడతారో? అన్నది టెన్షన్ గా మారింది. పాత వారితోనే ఈ మూడు స్థానాలను భర్తీ చేస్తారా? లేక కొత్త వారికి కేసీఆర్ చోటు కల్పిస్తారా? అన్నది ఇప్పుడు గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటికే రెండు స్థానాలు గవర్నర్ కోటాలో ఖాళీ అయ్యాయి. మరోస్థానం కూడా త్వరలో ఖాళీ కానుంది. దీంతో గులాబీ పార్టీ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికీ కొందరు టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ హామీ ఇచ్చి ఉండటంతో వారు కూడా ఈ స్థానాల భర్తీపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ మూడు స్థానాలను సామాజిక వర్గాల ద్వారా భర్తీ చేస్తారా? లేక తాను మాట ఇచ్చిన వారికి ఇస్తారా? అన్నది కేసీఆర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.టీఆర్ఎస్ సీనియర్ నేత నాయని నరసింహారెడ్డి పదవి జూన్ నెలలోనే పూర్తయింది. నాయని నరసింహారెడ్డి రాజ్యసభ పదవి కోరుకున్నారు. ఆయనకు దక్కకపోవడంతో తిరిగి ఎమ్మెల్సీ పదవి కేసీఆర్ ఇస్తారన్న టాక్ పార్టీలో ఉంది. వచ్చే నెలలో మరో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పదవీకాలం కూడా ముగియనుంది. ఇక రాములు నాయక్ పై అనర్హత వేటు పడటంతో ఈ పదవి కూడా భర్తీ చేయాల్సి ఉంది. కర్నె ప్రభాకర్ కూడా సీనియర్ నేత కావడంతో ఆయన పదవి రెన్యువల్ అవుతుందని అంటున్నారు.అయితే కొత్తగా కొత్తపేరు ఎమ్మెల్సీ జాబితాలోకి ప్రచారం రావడంతో టీఆర్ఎస్ నేతల్లో కంగారు మొదలయింది. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ కూతురు వాణితో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వాణికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు కేసీఆర్ రెడీ అయ్యారన్న టాక్ ఉంది. గవర్నర్ కోటాలోనే వాణికి కేసీఆర్ ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వనున్నారు. దీంతో ఎమ్మెల్సీ పదవి ఎవరికి రెన్యువల్ అవుతుంది? ఎవరికి దక్కుతుందన్న టెన్షన్ లో ఆ పార్టీ నేతలున్నారు. అయితే ఆషాఢం తర్వాతనే కేసీఆర్ ఈ పోస్టులు భర్తీ చేస్తారని చెబుతున్నారు.

Related Posts