నిజామాబాద్, జులై 10
ఒకేసారి నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం రేపింది. మృతి చెందిన నలుగురిలో ముగ్గురు కరోనా బాధితులు ఉన్నారు. మరొకరు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఆక్సిజన్ అందకే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా కరోనాతో ముగ్గురు, గుండెపోటుతో మరొకరు చనిపోయారని ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. మృతుల్లో ఇద్దరు నిజామాబాద్ నగరానికి చెందినవారు కాగా మిగిలినవారు భీంగల్, ఎడపల్లి ప్రాంతవాసులు. అయితే ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ వారు మృతి చెందారని మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శుక్రవారం కొద్దిసేపు ఆందోళన చేశారు. దీంతో కొద్ది సేపు ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఈ ఘటన పై విచారణకు ఆదేశించారు. పోలీసులు ముందు జాగ్రత్తగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.