న్యూ ఢిల్లీ జూలై 10
సార్స్ కోవ్ 2 వైరస్ వ్యాప్తి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త డేటాను రిలీజ్ చేసింది. కోవిడ్19 సంక్రమించే పద్ధతులపై జరిగిన తాజా అధ్యయనాల వివరాలను డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. కరోనా వైరస్ ఎటువంటి పరిసరాల్లో వ్యాప్తి చెందుతుందో వివరించారు. ఎటువంటి కోవిడ్19 లక్షణాలు లేని వారు కూడా ఇతరులకు వైరస్ అంటిస్తారని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. అయితే ఇది ఏ స్థాయిలో సంక్రమిస్తోందో క్లారిటీగా చెప్పలేమని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. లక్షణాలు ఉన్న వారి నుంచి మాత్రమే ఇతరుకు వైరస్ సోకే ప్రమాదం ఉందని గతంలో తేల్చిన ఆరోగ్య సంస్థ.. లక్షణాలు కనిపించకముందు కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొన్నది. వైరస్ సోకిన వ్యక్తితో ఎక్కువ సమయం గడిపిన వారికి వైరస్ సంక్రమించే అవకాశాలు ఉన్నట్లు తేల్చారు. వైరస్ సంక్రమించిన వ్యక్తి శ్వాసకోసం నుంచి రిలీజయ్యే తుంపర్లు ఏదైనా వస్తువుపై పడినా.. ఒకవేళ ఆ వస్తువులను మరో వ్యక్తి తాకినా, ముట్టుకున్నా.. అతనికి ఆ వైరస్ సోకే ప్రమాదం ఉందంటున్నారు. తుంపర్లు పడిన సర్ఫేస్‌ను తాకిన చేతివేళ్లతో కంటిని తుడుచుకుంటే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. ముక్కును, మూతిని ముట్టుకున్నా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. జనం ఎక్కువగా ఉన్న ఇండోర్ స్థలాల్లోనూ ఏరోజోల్ ట్రాన్స్‌మిషన్ జరుగుతున్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. రెస్టారెంట్లు, జిమ్‌ల నుంచి జరుగుతున్న ఏరోజోల్ ట్రాన్స్‌మిషన్‌పై మరింత స్టడీ చేయాల్సి ఉందని ఆరోగ్య సంస్థ పేర్కొన్నది.