ఏలూరు, జూలై 11,
వైసీపీలో అసంతృప్తి గళాలు బయట పడుతున్నాయా ? వ్యూహాత్మకంగా జరుగుతున్న జగన్ ప్రభుత్వంపై దాడిని తెలుసుకోలేక సొంత పార్టీ నేతల్లో నిర్వేదం కనిపిస్తోందా ? దీంతో వారంగా తమ అక్కసును వెళ్లగక్కుతున్నారా? అంటే.. తాజాగా వెలుగు చూసిన ఓ ఉదంతం ఔననే చెబుతోంది. విషయంలోకి వెళ్తే.. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలను ప్రధాన ప్రతిపక్షం వ్యూహాత్మకంగా తనవైపు తిప్పుకొంది. బీసీ వర్గానికి జగన్ ప్రభుత్వం వ్యతిరేకమని ప్రచారం చేసింది. బీసీలను జగన్ ప్రభుత్వం అణగదొక్కుతోందని పెద్ద ఎత్తున తన అనుకూల మీడియా ద్వారా కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.దీనికి గత నెలలో చోటు చేసుకున్న అచ్చెన్నాయుడు అరెస్టును, తాజాగా అరెస్టయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకుమార్ ఉదంతాన్ని కూడా ప్రతిపక్షం తనకు అనుకూలంగా మార్చుకుంది. నిజానికి ఈ ఇద్దరు కూడా తప్పు చేయకపోతే.. అరెస్టు చేసే ధైర్యం పోలీసులకు ఉంటుందా? పైగా వారిపై ఇంతేసి పెద్ద పెద్ద నేరాలు పెడతారా? అనేది చూస్తే.. సాధ్యమయ్యే కాదని, ఒకవేళ నిజంగానే వారు ఎలాంటి తప్పు చేయకపోతే.. పోలీసులపై పరువు నష్టం కేసులు దాఖలు చేయరా? అనేది ప్రధాన ప్రశ్న. కానీ, ఈ విషయాన్ని దాచేస్తున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. బీసీలపై మొసలి కన్నీరు కారుస్తోందన్న చర్చలు ఏపీలో మెజార్టీ వర్గాల్లో ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రహించలేక పోతున్న వైసీపీలోని కొందరు బీసీ నేతలు.. ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.నిజంగానే మనకు అన్యాయం చేస్తున్నారా? అనే చర్చ పెట్టారు. అదే సమయంలో తాజాగా ఖాళీ అయిన రెండు మంత్రి పదవులు బీసీ కేటగిరీలోవే కాబట్టి వాటిని బీసీలతోనే భర్తీ చేయాలని.. ఇలా చేయకపోతే.. అధిష్టానాన్ని ప్రశ్నించాలని కొందరు వ్యాఖ్యానించినట్టు పార్టీలో నెంబరు-2 విజయసాయిరెడ్డికే ఫిర్యాదులు అందాయి. అయితే పదవులు ఆశిస్తోన్న కొందరు వైసీపీ నేతలు ఈ డిమాండ్ పేరుతో సరికొత్త కుంపటికి తెరలేపారన్న చర్చలు కూడా వినపడుతున్నాయి.దీంతో ఈ విషయంపై ఫోకస్ పెట్టిన జగన్.. అసలు ఏం జరిగిందనే అంశాన్ని ఆరాతీస్తున్నారట. ఇప్పటికే ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారాన్ని ఆదిలో కొంత ఉదాశీనంగా చూడడంతో ఆయన ఇప్పుడు రెచ్చిపోయిన నేపథ్యంలో తాజాగా ఎవరైతే.. అక్కసు వెళ్లగక్కుతున్నారో వారిని ఆదిలోనే అదుపుచేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.