YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*పరిపూర్ణ భక్తి*

*పరిపూర్ణ భక్తి*

భగవంతుడికి, భక్తుడికి నడుమ అజ్ఞానం అనే అగాధం ఉన్నది. అవిద్య, మాయ, మోహం- అన్నీ ఆ అజ్ఞానపు రూపాంతరాలే. సూర్యకాంతిని అడ్డుకుని ఉన్న మబ్బుతొలగిపోగానే, ఆ కాంతి కిరణాలు భూమి, ఆకాశాలను తమ కౌగిట్లో చేర్చుకుని ప్రకృతి అందాన్ని ఇనుమడింపజేస్తాయి. మానవ హృదయాలను అలరిస్తాయి. స్మరణ అంటే తలపు. నిరంతరం ఆ భగవంతుణ్ని తలచుకోవడం. మన బాగోగులు గమనించే ఒకే దైవం కొలువున్నదని గుర్తు చేసుకోవడం. పగలు-రాత్రి, ఇంటా-బయట, కష్టాల్లో-సుఖాల్లో తలపు తలుపులు ఆ భగవంతుడి రాకకోసం తెరచి ఉంచాలి.
భజన అంటే కొలువు. ఒక సేవకుడు తన యజమాని పట్ల భక్తిశ్రద్ధలు కలిగిఉన్న చందాన, ఈ జన్మను ప్రసాదించిన ఆ భగవంతుడిని తలచుకుంటూ, పూజిస్తూ, ఆయన కోరిక మేరకు సేవలు అందజేయాలి. మననం అంటే చింతన, ధ్యానం, గమనం. చిత్తవృత్తులను ఏకాగ్రంచేసి ఆ భగవంతుడి గురించి మనసులో ధ్యానించాలి. స్మరణ మానసికం, భజన ఆంగికం, మనన ఆత్మికం అని చెప్పుకోవచ్చు. ఉదయం నిద్ర లేవగానే కూటస్థుడైన మనలోనేఉన్న భగవంతుడిని తలపోస్తే, కొండంత బలంతో, మనోధైర్యంతో ఆ రోజు గడుస్తుంది. మెలకువలో, కలలో, గాఢ నిద్రలో అందని ఆ భగవంతుడి పరమహంస తత్త్వం ఒక దివ్యమైన అనుభూతి కలిగిస్తుంది. ఆ అనుభూతిలో చేపట్టిన సేవలన్నీ భగవంతుడికి  ప్రీతి కలిగిస్తాయి. పరమప్రేమ స్వరూపుడైన ఆ భగవంతుడు ఆ సేవలను స్వీకరించి భక్తులకు ఆనందమకరందం అందిస్తాడు.
మరో ఆలోచనకు తావులేకుండా తదేక ధ్యానంతో కొనసాగటమే మననం. అన్యమైన ఆలోచనలు కట్టిపెట్టి నన్ను మాత్రమే సేవిస్తూ శరణు కోరినవారిని కరుణతో ఆదరిస్తానని భగవాన్‌ అర్జునుడికి గీతోపదేశం చేస్తూ హామీ ఇచ్చాడు.
భక్తి జ్ఞాన వైరాగ్యాలు భగవంతుడి దగ్గరికి చేర్చగల మార్గాలు. స్మరణ, భజన, మనన, ఆ మార్గంలో గమించే భక్తుడికి రక్షాకవచాలు. హృదయక్షేత్రంలో భక్తిబీజం నాటితే అది జీవనక్షేత్రంలో బంగారం పండిస్తుంది. భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం, తోడునీడగా ఉంటాడన్న విశ్వాసం కలిగితే- జ్ఞాన వైరాగ్యాలు తోడునీడగా గమ్యం చేరుస్తాయి. దేవుడు ఉన్నాడన్న ఎరుకే కలిగిననాడు హృదయ మందిరంలో జ్ఞానపీఠం వెలుగుతుంది. ఆ దీపం వెలుగువెంట నడిస్తే అశివ కర్మలు దరిచేరవు. చేయవలసిన పనుల పట్ల ఆసక్తి, చేయకూడని పనుల పట్ల విరక్తి కలిగి ఉండటమే వైరాగ్యం. భక్తి కలిగిన జ్ఞానవంతుడు చేపట్టే కర్మలన్నీ యజ్ఞంతో సమానం. కర్మజ్ఞానాలు భక్తిలో రసీభవించి పరిపూర్ణం అవుతాయి. తల్లి గర్భంలో ఉండగా నారదుడు ప్రహ్లాదుడికి విష్ణుభక్తి కలిగించాడు. నిరంతరం హరినామస్మరణ వల్ల ఆ బాలుడికి సకల వేదశాస్త్ర విజ్ఞానసారం కరతలామలకం అయింది. కాలకూటవిషం తాగినా, తాచుపాము కాటేసినా, సంకీర్తనా ప్రభావంవల్ల ఎలాంటి ప్రమాదం జరుగలేదు. హరిపట్ల ద్వేషంతో వైరం వహించిన తండ్రి హిరణ్యకశిపుడికి నరహరి ద్వారా మోక్షం ఇప్పించాడు.
ఏ చదువూ ఎరుగని సాలెపురుగు, కాలసర్పం, ఏనుగు, శివపూజ చేసి తరించాయి. భగవంతుడిని చేరడానికి ఉన్న మూడు మార్గాల్లో భక్తిమార్గం ఎందరికో దారిదీపం అయింది. అజామీళుడు, గుణనిధి, నిగమశర్మ వంటి దుర్మార్గులు, పాపాత్ములు, పతితులు భగవద్భక్తి లేశమాత్రం స్పృశించడంవల్ల మోక్షం పొందగలిగారు. పాపాలకూపం అయిన ఈ కలికాలంలో కూడా భక్తి ప్రపత్తులతో ముక్తిపొందిన మహానుభావులు ఎందరో ఉన్నారు. భక్తి అంటే ప్రేమ, ప్రేమకు త్యాగమే పెన్నిధి. భక్తుల జోలికి వెళ్ళినవారికి ఆ భగవంతుడి దండన తప్పదు. అంబరీషుడిని పరీక్షించి, అవమానించిన దుర్వాస మహర్షిని కూడా సుదర్శనం వీడకపోవడం భక్తి శక్తికి ప్రబల నిదర్శనం.

Related Posts