శ్రీమద్రామాయణంలో శ్రీరాముడు ఏకాంతవాసంగా గడిపిన సమయాలు సందర్భాలు మానవాళికి మహోపదేశాన్నిస్తాయి. పదమూడు సంవత్సరాల వయసులోనే వైరాగ్య భావనలు శ్రీరాముణ్ని చుట్టుముట్టాయి. ఏకాంతవాసానికి గురిచేశాయి. కులగురువైన వసిష్ఠుడు జ్ఞానబోధ చేసి శ్రీరాముణ్ని కర్తవ్యోన్ముఖుడిగా మలచాడు. తన చుట్టూ ఎంతమంది ఉన్నా, మనసు ఒంటరిదైపోతే అది ఏకాంత జీవనానికే దారితీస్తుంది. తన కూడా ఎవరు లేకున్నా మనసు ఆనందంగా ఉంటే ప్రపంచమంతా తనదిగానే ఉంటుంది. ఏకాంతవాసం సమస్యలను పెంచేదిగా కాకుండా, పరిష్కారాలను సూచించేదిగా ఉండాలి. సీతాపహరణ తరవాత శ్రీరాముడి వెంట లక్ష్మణుడు ఉన్నాడు. రామచంద్రుడు దండకారణ్యంలో మున్యాశ్రమాలు దర్శించాడు. సుగ్రీవుడితో చెలిమి చేశాడు. హనుమ తోడుగా, నమ్మినబంటుగా ఉన్నాడు. వానరసైన్యం వెంట నడిచింది. అయినా మనసు ఒంటరితనంతోనే ఆవేదన చెందింది. శ్రీరాముడు వానరసైన్యంతో సముద్రం ఒడ్డుకు చేరతాడు. వారధి నిర్మాణం జరగాల్సిఉంది. రాత్రి సమయంలో చందమామ ఆకాశంలో కాంతులీనుతుంటాడు. దాపున ఉన్న లతలు, వృక్ష సముదాయాల మీదుగా వచ్చే చల్లని గాలి పరిమళం శ్రీరాముడి శరీరాన్ని తాకుతుంది. ఆ చల్లనిగాలితో శ్రీరాముడు ముందుగా లంకలో ఉన్న సీతకు హాయి కలిగేలా చేసి, తరవాత తన శరీరానికి సోకితే- ‘నా వెంట సీత ఉన్న అనుభూతిని పొందుతాను కదా’ అంటాడు. మనసు మెచ్చనిది, నచ్చనిది- మనిషిని ఏకాంత భావనకు గురిచేస్తాయి. అయినా- శ్రీరాముడు కుంగిపోలేదు. కర్తవ్య విముఖుడు కాలేదు. వారధి నిర్మాణం జరిపించి, వానరసైన్యంతో లంకలో ప్రవేశించి రావణ సంహారం చేశాడు. మహాపురుషులు, జ్ఞానులు, వివేకవంతులు ఏకాంత భావనల వైపరీత్యాలను, రుగ్మతలను అధిగమిస్తారు. శ్రీమద్రామాయణం ఆరుకాండలుగా ఉంటుంది. ఉత్తరకాండ ఏడోది. నిండుగర్భవతి సీతమ్మను అడవికి పంపిన క్షణం నుంచి అవతార పరిసమాప్తి వరకు ఓ వైపు రాజ్యపాలన చేస్తున్నా, మానసికంగా దుర్భరమైన ఏకాంతవాసమే శ్రీరాముడు గడిపాడు. ఏకాంత వాసాన్ని ఆత్మజ్ఞానయోగంతో అధిగమించి కర్తవ్యపాలన చేశాడు అవతార పురుషుడు. ఏకాంతవాసానికి ఎంతో శక్తి ఉంది. అది మనిషి తనకు తానుగా మనోవిశ్లేషణ గావించుకొని జీవితాన్ని చైతన్యం చేసుకునేందుకు దోహదపడుతుంది. ఏకాంతంగా గడిపే క్షణాలు మనిషి మస్తిష్కంపై ప్రభావం చూపుతాయి. అలసి ఆవేదనకు గురైన మనసును సేద దీరుస్తాయి. సరికొత్త ఆలోచనాస్రవంతికి దోహదపడతాయి. ఏకాంతపు ధ్యానసాధనకు విశ్వంలోని జ్ఞానశక్తిని పొందే పటిమ ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ‘ధ్యానరూపమైన విద్యే నా దేహం’ అని శ్రీమన్నారాయణుడు దక్షప్రజాపతితో అన్నాడన్న ఇతిహాసోక్తిని శ్రీమద్భాగవతం స్పష్టం చేసింది. ఏకాంతవాసమంటే ఒంటరితనం కాదు. మౌనం అంటే నిశ్శబ్దమనీ కాదు. రామావతార సమాప్తిని గుర్తెరిగించడానికి, యమధర్మరాజు మునివేషంలో వచ్చి, శ్రీరాముడితో ఏకాంతంగా సమావేశమవుతాడు. లక్ష్మణుణ్ని తమ ఏకాంతానికి భంగం వాటిల్లకుండా చూడమని శ్రీరాముడు ఆజ్ఞ ఇస్తాడు. దుర్వాస మహాముని రాకతో శ్రీరాముడి ఏకాంత సమావేశం భంగమవుతుంది. లక్ష్మణుడికి నగర బహిష్కార శిక్ష విధిస్తాడు శ్రీరాముడు. అవతార పరిసమాప్తి అయింది. మనిషికి ఏకాంతవాసమే ప్రాప్తమైనప్పుడు ఆత్మజ్ఞాన సిద్ధి సాధనకై ఆ సమయాన్ని వినియోగించుకోవాలని ఆధ్యాత్మికవేత్తలు అంటారు. ఎండుకట్టెలో అగ్నిని రగుల్కొల్పినట్లుగా, తమ హృదయాల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మను ప్రకాశింపజేసుకోవాలి.