చంద్రబాబు అక్రమాలకు కొమ్ముకాస్తున్న అజయ్ జైన్
వైఎస్ హయాంలో చిక్కుల్లో పడిన ఐఏఎస్ ల తరహాలోనే చంద్రబాబు జమానాలో అజయ్ జైన్ చిక్కుల్లో పడటం ఖాయం అని ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అమరావతికి సంబంధించిన అత్యంత వివాదస్పద ‘స్విస్ ఛాలెంజ్’ విధానం మొదలుకుని అన్ని కీలక ప్రాజెక్టుల విషయంలో ఆయన పోషిస్తున్న పాత్ర ఐఏఎస్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.మౌలికసదుపాయాలు, పెట్టుబడుల శాఖ వ్యవహారాలను చూస్తుంది ఆయనే. తాజాగా జరిగిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్ల రద్దు విషయంలో ఆయన చిక్కుల్లో పడే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. టెండర్లు…ప్రాజెక్టుల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై కన్నేసి ఉంచిన కేంద్రం..తాజా పరిణామాలను కూడా తీవ్రంగా పరిగణిస్తోందని చెబుతున్నారు. అయితే కేంద్ర పౌరవిమానయాన శాఖకు చెందిన ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి దక్కిన భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు రద్దులో అజయ్ జైన్ పాత్ర ఏమిటనే దానిపై అధికారుల్లో చర్చ జరుగుతోంది.. అయితే అజయ్ జైన్ కూడా ఈ రద్దుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఉంటే ఆయన కూడా చిక్కుల్లో పడటం ఖాయం అని.. ఆయన వద్దని ఫైలులో రాసినా చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ దీన్ని ఆమోదించి ఉంటే…దానికి సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
అమరావతికి సంబంధించి స్విస్ ఛాలెంజ్ పద్దతిన సింగపూర్ సంస్థలకు పనులు అప్పగింత, హైబ్రిడ్ యాన్యుటి కింద పనులు అప్పగింత వంటి విషయంలో చంద్రబాబు ఏది కోరుకుంటే అది అమలు అయ్యేలా చూడటంలో అజయ్ జైన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. చంద్రబాబు తీసుకునే ప్రతి వివాదస్పద నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉంటుందని ఐఏఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు తాను కోరుకున్నట్లు ప్రైవేట్ సంస్థకు టెండర్ రాలేదని…విమానాశ్రయాల నిర్వహణలో ఎంతో అనుభవం ఉన్న ఏఏఐని పక్కన పెట్టిన విషయంపై ఇఫ్పటికే కేంద్రానికి ఫిర్యాదులు వెళ్ళాయి. చంద్రబాబు కోరినట్లు పనిచేస్తారనే కారణంతోనే ఆయనకు అత్యంత కీలకమైన విద్యుత్, మౌలికసదుపాయాలు, పెట్టుబడుల శాఖ వంటి బాధ్యతలు అప్పగించారని అధికారుల్లో ప్రచారం జరుగుతోంది. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఉన్న అమరావతి బాధ్యతలు చూసేది కూడా అజయ్ జైనే కావటం విశేషం.ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్.