ప్రమాణ స్వీకారం చేసే ముందు పార్లమెంట్ మెట్లకు మొక్కి అడుగుపెట్టిన ప్రధాన మంత్రికి పార్లమెంటరీ విధానాలు, సంప్రదాయాల పట్ల గౌరవం ఉంటుందని ప్రజలందరూ అనుకొన్నారు.. ఆయన అవిశ్వాసంపై అనుసరించిన తీరుతో పార్లమెంటరీ విధానాలపై ఏ మాత్రం గౌరవం చూపలేదని అర్థం చేసుకోవచ్చు అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్లమెంట్ సజావుగాసాగనీయలేదుఅంటూ ప్రధానమంత్రి చేస్తున్న దీక్ష నమ్మశక్యంగా లేదు అని చెప్పారు. ఎవరైతే సభను సాగనీయకుండా చేశారో వాళ్ళే తాము బాధితులం అన్న రీతిలో దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. గురువారం ఉదయం పవన్ కళ్యాణ్ గారితో సిపిఎం, సిపిఐ నేతలు హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా సాధనకు చేపట్టే కార్యక్రమాల కార్యాచరణ, ప్రధానమంత్రి, బిజెపి చేపట్టిన దీక్ష తదితర అంశాలపై చర్చించారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఈ నెల 16 న రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చింది. ఈ బంద్ కు మద్దతు ఇవ్వాలని జనసేన, సిపిఎం, సిపిఐ నిర్ణయించాయి.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనకి లెఫ్ట్ నెంట్ గవర్నర్, కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని నిరసన చేస్తే అపహాస్యం చేసినవాళ్లు ఇప్పుడు అదే తరహాలో దీక్షలు చేస్తున్నారు. ప్రధాని ఓ బలీయమైన శక్తి అని ప్రజలతోపాటు నేనూ విశ్వసించాను. ఇప్పుడు అవిశ్వాసం చర్చకు రాకుండా చేసి ఆ నమ్మకాన్ని కోల్పోయారు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో భారతీయ జనతా పార్టీ చేసిన తప్పులు వున్నాయి. అందుకే దాటవేత ధోరణిలో వెళ్లారు. అవిశ్వాసంపై రెండు రోజులు చర్చిస్తే అన్నీ తెలిసేవి. చర్చకు చేపట్టి ఉంటే వారి చిత్తశుద్ధి తెలిసేది. అలాగే టిడిపి, వైసిపీల తప్పులున్నాయి. చర్చకు రాకుండా చూడటం మూడు పార్టీలకీ అవసరమే. ఇప్పుడు వాళ్ళే ప్రదర్శనలు చేస్తున్నారని అన్నారు.
టిడిపి, వైసిపి, బీజేపీలను ప్రజలు... ముఖ్యంగా యువత, మహిళలు నమ్మడం లేదు. యువత ఆకాంక్షలకు తగ్గట్టు ప్రజలకు బాధ్యత గా వుండే రాజకీయాలకి శ్రీకారం చుట్టేలా మూడో శక్తి వస్తుంది. పార్లమెంట్ సజావుగా సాగలేదు అంటూ దీక్షలు చేస్తున్నవాళ్లు తదుపరి వస్తే తాము ఎలా హోదా తీసుకువస్తారో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదా సాధన సమితి ఈ నెల 16 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చిందనీ, ఆ బంద్ కు జనసేన, సిపిఎం,సిపిఐ మద్దతు ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 15 న అనంతపురం, 24 న ఒంగోలు, మే 6 న విజయనగరంలో తలపెట్టిన కార్యక్రమాల్ని వాయిదా వేస్తున్నాం" అన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ "ప్రధానమంత్రి మోడీ ఎవరి మీద దీక్ష చేస్తున్నారో దేశ ప్రజలకి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మెజార్టీ వుంది కదాని ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా సభను బుల్డోజ్ చేసి ఇప్పుడు దీక్ష చేయడం ఏమిటి? ప్రధాని మోడీ నిరంకుశ వైఖరితో హిట్లర్ ను తలపిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం ఈ నెల 16 న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బంద్ కు అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలవాలి" అన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ "పార్లమెంట్ ను గౌరవించని ప్రధానమంత్రి, తప్పును ప్రతిపక్షాలపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చేస్తున్న దీక్ష ఓ నాటకం. పార్లమెంట్ సభ్యులతో మాట్లాడేందుకు పది నిమిషాల సమయం కూడా ఇవ్వలేదు. నియంతలా వ్యవహరిస్తూ ప్రజల్ని మభ్యపెట్టే పని చేస్తున్నారు. రాష్ట్ర బంద్ ఉన్నందున అనంతపురం కార్యక్రమాలు వాయిదా వేస్తున్నాం" అన్నారు. ఈ సమావేశంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నేతలు వై.వెంకటేశ్వర రావు, గఫూర్, చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు.