హైద్రాబాద్, జూలై 11,
హైదరాబాద్ వాసులకు ఇప్పుడు కరోనా భయం వెంటాడుతుంది. టెస్ట్ ల సంఖ్య తక్కువగా జరిగినా అందులో 20 శాతం నుంచి 50 శాతం పాజిటివ్ కేసులుగా లెక్క తేలుతూ ఉండటంతో అంతా బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా ఉపాధి కోసం హైదరాబాద్ లో ఉంటున్న వారికి తిరిగి లాక్ డౌన్ విధించే పరిస్థితి ఉందనే ప్రచారంతో సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఇంటి అద్దెలు, జీవనానికి అవసరమైన ఖర్చులు కూడా లేకపోవడంతో మరికొందరు నా జన్మభూమి ఎంతో అందమైన దేశం అంటూ వారి మూలాలకు బయలుదేరుతున్నారు.హైదరాబాద్ లో సుమారు 6 లక్షల మంది ఐటి పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్నట్లు అంచనా. ఇప్పటివరకు ఐటి కంపెనీలు కరోనా ప్రభావంతో వర్క్ ఫ్రెమ్ హోం సౌకర్యం కల్పించాయి. అదీ హైదరాబాద్ లో ఉండే పని చేసుకోవాలని కోరాయి. కానీ ఇప్పుడు ఈ ఆంక్షల్లో కొంత సడలింపు ను ఐటి పరిశ్రమలు ఇచ్చాయి. మీరు ఎక్కడి నుంచైనా పని చేసుకోవొచ్చు, సొంత ఊరి నుంచి కూడా చేసుకోవచ్చు, అంటూ స్వేచ్ఛను ప్రసాదించాయి. దాంతో ఇంటి కి పోతే ఈ కరోనా బాధ అయినా తప్పుతుందని అంతా వచ్చేస్తుండటమే ఎపి చెక్ పోస్ట్ దగ్గర తాకిడి కి రీజన్ అయ్యింది.లాక్ డౌన్ వన్ టూ త్రి లలో దేశంలో లక్షలాదిమంది వలస కూలీలు ఉపాధి లేక, తిండి లేక సొంత గూటికి కాలినడకనే బయల్దేరారు. వారి పాదయాత్రలు చాలా చూసి ప్రజలు చాలించి పోయారు. చాలామంది మార్గమధ్యం లో తనువు చాలించారు కూడా. అయితే ఆ తరువాత కేసుల సంఖ్య తగ్గి అంతా సవ్యం అవుతుందనుకుంటున్న దశలో మహమ్మారి మరింత విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలే కాదు, ధనికులు హైదరాబాద్ నుంచి సొంత గూటికి చేరే పనిలో బిజీగా ఉండటం విశేషం.