YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తోక పార్టీ నుంచి బయిటకు వచ్చే ప్రయత్నంలో కమలం

తోక పార్టీ నుంచి బయిటకు వచ్చే ప్రయత్నంలో కమలం

విజయవాడ, జూలై 13, 
అదేంటి ఈ ఇద్దరూ బద్ధ శత్రువులు కదా. ఒకరు తూర్పు అయితే మరొకరు పడమర కదా. ఇద్దరూ ఒకరిని ఒకరు రాజకీయంగా ఎలినిమేట్ చేసుకునేందుకు ఎంతదూరమైనా వెళ్తారు కదా. అలాంటిది ఇద్దరూ ఒకరికి ఒకరు ఆసరా ఎలా అవుతారు అన్న డౌట్లు ఎవరికైనా రావచ్చు. కానీ రాజకీయం బాగా తెలిసిన వారు ఇదే నిజం అంటారు. కాస్తా లోతుగా ఆలోచిస్తే ఇందులో లోగుట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరూ ఒకరి పొడ మరోకరిని గిట్టకపోయినా ఒకరి నీడన మరొకరు తెలియకుండానే సేదతీరుతున్నారు. అదేంటో చూడాలంటే బీజేపీ పొలిటికల్ గేం మీద ఒక అంచనాకు రావాలి.ఓ వైపు టీడీపీ బలమైన ప్రాంతీయ పార్టీ. ఇప్పటికి దాదాపుగా 22 ఏళ్ళుగా పలుమార్లు అధికారం అనుభవించింది. ఇక చంద్రబాబు మూడు సార్లు సీఎం అయ్యారు. ఆయన మామ ఎన్టీయార్ మూడు సార్లు సీఎం చేశారు. ఇక లోకేష్ బాబు తరువాత సీఎం రేసులో రెడీగా ఉన్నారు. ఏపీలో జగన్ రాజకీయంగా తగ్గితే మళ్లీ చాన్స్ దక్కేది చంద్రబాబుకే. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు, ఇక చంద్రబాబును పక్కన పెడితే జగన్ కి ఎదురులేకుండా పోతుంది. అంటే ఇద్దరూ ఇద్దరుగా ఢీ కొట్టినన్నాళ్లు ఇద్దరికీ సేఫ్ అన్న మాట. అందుకే జగన్ ని నాడు బెయిల్ రద్దు చేసి బీజేపీ జైలు పాలు చేయలేదు. ఇపుడు బాబుని కూడా జగన్ కోరుకున్న విధంగా ఇబ్బందుల పాలు చేయడంలేదు.ఈ ఇద్దరిలో ఒకరు తగ్గిపోతేనే బీజేపీకి రాజకీయ లాభం. ఈ రోజుకు అంటే సార్వత్రిక ఎన్నికలు గడచి ఏడాది అయినా కూడా ఏపీలో బీజేపీకి రాజకీయంగా పట్టు దక్కడంలేదు. పవన్ తో పొత్తు పెట్టుకున్నా కూడా జనంలో ఇంపాక్ట్ పడలేదు. పైగా వైసీపీ, టీడీపీల మధ్యనే ఏపీ జనం చీలిపోయి ఉన్నారు. దాంతో ఇద్దరికీ దగ్గరగా దూరంగా రాజకీయం ఆడుతూ బీజేపీ తన ఆటలో వారిని పావులుగా చేస్తోంది. బాబు తగ్గాలంటే జగన్ రెచ్చాలి. అందుకే జగన్ టీడీపీ నేతల మీద కేసులు పెడుతూంటే కమలనాధులు శభాష్ అంటున్నారు. మరో వైపు జగన్ పాలనను టీడీపీ నేతలు అడ్డుకుంటే కూడా సై అంటున్నారు.తమిళనాడులో అయితే జాతీయ పార్టీలకు అసలు చోటు ఉండదు, ఎందుకంటే వారికి తెలుసు. ఒకసారి జాతీయ పార్టీలు అడుగు పెడితే తన కధ ముగిసిపోతుందని, తెలంగాణాలో చూసుకుంటే కూడా కేసీయార్ పులిలా గర్జిస్తున్నాడు, అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ బలపడకుండా ఎప్పటికపుడు కొత్త ఎత్తులు వేస్తున్నాడు. కానీ ఏపీలో మాత్రం భిన్న రాజకీయం ఏ మాత్రం బలం లేని బీజేపీని కొలుస్తూ జగన్,బాబు తమలో తాము కాట్లాడుకుంటున్నారు. ఈ పోరాటంలో తమ రాజకీయ అస్థిత్వాలకు కూడా చేటు తెచ్చుకుంటున్నారు. బాబు అయితే ఇపుడు బాగా లొంగిపోయి వంగిపోతున్నారు. కానీ బీజేపీకి ఇది చాలదు, ఇంకా బాగా ఆయన లొంగాలన్నది వారి ఆలోచన. ఇక జగన్ ని కూడా ఎంత వంచాలో అంతలా వంచేస్తేనే తమ రాజకీయ పబ్బం నెరవేరుతుందని బీజేపీ ఎత్తులు వేస్తుంది. ఏపీలో రెండు పార్టీల పిట్ట పోరుని తీర్చే పిల్లిగా బీజేపీ ఉంది. అయితే ఇప్పటికిపుడు బీజేపీ బలం ఏపీలో పెరగకపోవడమే వారి ఆట ముందుకు సాగేలా చేయడంలేదు. అదే కనుక బీజేపీకి కాస్తా ఊపిరి వస్తే బాబు, జగన్ ఇద్దరినీ బీజేపీ తన చదరంగంలో పావులుగా మార్చేయడం ఖాయమని అంటున్నారు.

Related Posts