అందాల రాముని వర్ణించటం రామభక్తుని ప్రథమ లక్షణం. ఆ ఇందీవర శ్యాముని శరీర సౌందర్యమును వర్ణనలో కమలములతో ఉపమానము చేయనిదే అది సంపూర్ణము కాదు, మనసును హత్తుకోదు. ప్రతి శ్రీహరి స్తుతిలో ఈ ఉపమానము ఉండవలసిందే. అలాగే, రాముని నుతిలో ఆయన ధర్మ సంరక్షణలో చేసిన దుష్ట సంహారము, ఆయన ధనుస్సు, అస్త్రములు గురించి కూడా ప్రస్తావన తప్పకుండా జరుగుతుంది.
ఇదే శైలిని, భావాన్ని గోస్వామి తులసీ దాసు తన రామచంద్ర స్తుతిలో వ్యక్త పరచారు. తులసీదాసు హృదయములో వికసించిన మనోజ్ఞ మాధుర్య భక్తి సుమం రామచంద్ర స్తుతి. అవధ భాషలోనే కాకుండా సంస్కృతములో కూడా ఆయన గొప్ప రచనలు చేసాడు అనటానికి ఈ నుతి ఒక గొప్ప ఉదాహరణ. తులసీ దాసు కొన్ని అద్భుతమైన ఉపమానములు, పదప్రయోగాలు ఈ నుతిలో చేసారు - హరణ భవ భయ దారుణం - దారుణమైన సంసారమనే భయాన్ని హరించే వాడు...అంతకన్నా రాముని మహిమను చెప్పే భావన ఏముంటుంది?. అలాగే కమలమునకు కంజము అనే పదము ఉపయోగించి, ఆ రాముని అందమైన కన్నులు, చేతులు, పాదములు, ముఖము అన్నీ ఆ వికసించే కలువలా అందముగా ఉన్నాయి అనే భావాన్ని ముత్యాల వరుసలా, కాసుల పేరులా పేర్చారు తులసీ దాసు. నవ నీల నీరద సుందరం అనే పద మాలికతో రాముని నీల మేఘ శ్యామ రూపాన్ని కన్నులకు కట్టినట్టుగా రచించారు. రఘువంశ కులతిలకుడు, కోసల రాజ్యమనే ఆకాశానికి చంద్రుడు, దశరథ పుత్రుడు అనే భావాన్ని 'రఘునంద ఆనందకంద కోసల చంద దశరథ నందనం' అనే పద రత్న మాలికతో వర్ణించారు.
అలాగే, ప్రతి చరణంలోనూ మనోహరమైన పద ప్రయోగం - (భయ దారుణం, కంజారుణం), (నీరద సుందరం, జనక సుతావరం), (దైత్య వంశ నికందనం, దశరథ నందనం), (అంగ విభూషణం, జిత ఖర దూషణం), (ముని మనరంజనం, ఖలదళ గంజనం) - ఇలా కవలల వంటి కలువలైన పదాలను ప్రయోగించి, కమలలోచనుని, కమలనాభుని, కమల ప్రియుని భక్తితో, భావముతో నుతించారు గోస్వామి. అందుకే ఈ స్తుతి ఎంతో ప్రాచుర్యం పొందింది.
శ్రీరామచంద్ర కృపాళు భజ మన హరణ భవభయ దారుణం
నవకంజలోచన కంజముఖ కరకంజ పదకంజారుణం
కందర్ప అగణిత అమిత ఛవి నవ నీల నీరద సుందరం
పటపీత మానహు తడిత రుచి శుచి నౌమి జనక సుతావరం
భజ దీన బంధు దినేశ దానవ దైత్యవంశ నికందనం
రఘునంద ఆనందకంద కోసల చంద దశరథ నందనం
శిర ముకుట కుండల తిలక చారు ఉదార అంగ విభూషణం
ఆజానుభుజ శర చాపధర సంగ్రామ జిత ఖరదూషణం
ఇతి వదతి తులసీదాస శంకర శేష ముని మన రంజనం
మమ హృదయకంజ నివాస కురు కామాదిఖలదళ గంజనం
తాత్పర్యము:
ఓ మనసా! వికసించిన కమలముల వంటి కన్నులు, ముఖము, చేతులు, పాదములు కల, అమితమైన కృప కలిగిన, ఈ జీవనములోని భయాలను పారద్రోలే శ్రీ రామచంద్రుని భజించుము. కోటి మన్మథుల కన్నా అందమైన వాడు, క్రొత్తగా ఏర్పడిన నీలి మేఘమువలె సుందరుడు, ఎల్లప్పుడూ శుచియైన పీతాంబరములు (పచ్చని పట్టు వస్త్రములు) ధరించి అందముగా ఉండేవాడు, సీతాదేవి వరుడు అయిన రామచంద్రుని భజించుము. దీన బంధువు, సూర్యవంశమున జన్మించిన వాడు, రాక్షస వంశములను నిర్మూలనము చేసిన వాడు, రఘు కులమునకు ఆనందకారుడు, కోసల రాజ్యానికి చంద్రుని వంటి వాడు, దశరథుని పుత్రుడు అయిన శ్రీ రాముని భజించుము. ఆ శ్రీరాముడు శిరసుపై కిరీటమును ధరించిన వాడు, కుండలములు ధరించిన వాడు, ఎన్నో ఆభరణాలతో శోభిల్లే శరీరము కలవాడు, మోకాళ్ళ వరకు ఉన్న చేతులకు ధనుస్సు, శరములు కలిగిన వాడు, యుద్ధములో ఖర దూషణ రాక్షసులను సంహరించిన వాడు అయిన రామచంద్రుని భజించుము. నా హృదయ కమలములో నివసించే ఓ రామచంద్రా! నాలోని కామాది దుష్ట గుణముల సమూహమును నాశనము చేసే ప్రభూ!, శంకరుడు, అది శేషుడు, ఇతర మునుల మనసు రంజిల్ల చేసే రామా అని తులసీదాసు నుతిస్తున్నాడు.
BY: SRI VARAKALA MURALIMOHAN