ప్రత్యేక హోదా ఏపీ జీవన్మరణ సమస్యగా మారింది.విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు చేస్తున్న పోరాట ఉద్ధృతిని మరింత పెంచాలని, క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల్ని చైతన్యపరచాలని టీడీపీ నిర్ణయించింది. నాలుగేళ్లపాటు నాన్చిన కేంద్రం హోదా ఇవ్వకుండా.. విభజన హామీలను నెరవేర్చకుండా మొండి చేయి చూపింది. ఒకసారి హోదా కావాలని, మరోసారి ప్యాకేజీ చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊగిసలాట ధోరణిని అనుసరించింది. కానీ బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలు దెబ్బతినడం, చివరి బడ్జెట్లోనూ రాష్ట్రానికి అరకొర కేటాయింపులే ఉండటంతో.. చంద్రబాబు వైఖరి మారింది.ఈ నెల 30న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. నాలుగేళ్ల క్రితం ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన నరేంద్రమోదీ ఏప్రిల్ 30న తిరుపతిలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్‌కు అనేక హామీలిచ్చారు. తాము అధికారంలోకి వస్తే దిల్లీని మించిన రాజధానిని నిర్మించుకునేలా ఆంధ్రప్రదేశ్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. అప్పట్లో మోదీ ఇచ్చిన హామీల్ని గుర్తుచేస్తూ, వాటిని అమలుచేయకుండా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా అన్యాయం చేసిందీ వివరించేందుకు ఏప్రిల్ 30న తిరుపతిలో టీడీపీ బహిరంగ బహిరంగ సభ నిర్వహించనుంది.ఢిల్లీ వెళ్లి, నేషనల్ మీడియాకు ప్రెస్ మీట్ పెట్టి, వీడియోలు, డాక్యుమెంట్ లతో ఎలా వివరించి, మోడీకి షాక్ ఇచ్చారో, ఈ సభలో కూడా, ప్రజల వద్దకు వెళ్లి చంద్రబాబు అలా వివరించనున్నారు... ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం జరిగిన తెదేపా వ్యూహ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలో మొదలుపెట్టి, ప్రతి నెలా ఒక్కో జిల్లాలో భారీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రతి జిల్లాలో విస్తృత స్థాయిలో అఖిలపక్ష సమావేశాల్ని నిర్వహించనున్నారు. అన్ని వర్గాల్నీ ఆహ్వానించి, కేంద్రం చేసిన అన్యాయాన్ని వివరించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు కేంద్రంపై పోరాటానికి అందివచ్చిన ప్రతి సందర్భాన్నీ తెదేపా వినియోగించుకోనుంది. ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించనున్నారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నీరుగారుస్తూ కేంద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోందని, దానికి సద్బుద్ధి కలిగేలా చూడాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహాల వద్ద అర్జీలు అందజేసే కార్యక్రమాన్ని తెదేపా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుంది.దళితతేజం కార్యక్రమం ముగిసిన సందర్భంగా ఈ నెల 20న గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా లక్షమంది దళితులు, క్రైస్తవ మైనారిటీలతో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్రంపై పోరాటాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు నియోజకవర్గాల వారీగా సైకిల్ యాత్రలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఢిల్లీలో పార్లమెంటు వేదికగాను, వెలుపలా పోరాటం చేసిన పార్టీ ఎంపీలు నియోజకవర్గాలకు తిరిగి వస్తున్న నేపథ్యంలో భావి పోరాట కార్యాచరణపై వ్యూహ కమిటీ చర్చించింది. ఎంపీలతో బస్సు యాత్ర నిర్వహించాలన్న ప్రతిపాదనపైనా చర్చ జరిగింది. అన్న క్యాంటీన్లు త్వరలో ఏర్పాటుచేయాలని, నిరుద్యోగభృతి విధి విధానాన్ని ఖరారుచేసి వెంటనే అమల్లోకి తేవాలని నిర్ణయించారు.