తిరుపతి, జూలై 14,
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబం రాజకీయ సంధ్యలో నలిగిపోతోంది. ముద్దు కృష్ణమ నాయుడు మరణంతోనే ఈ కుటుంబం రాజకీయంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిందనే వాదన ఉంది. అదే సమయంలో కుటుంబం లోనూ రాజకీయ పదవులపై తల్లీ కుమారుల మధ్య తీవ్ర విభేదాలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో రాజకీయంగా ముద్దు కృష్ణమ నాయుడు కుటుంబం ఒకానొక దశలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనేక కష్టనష్టాలకు ఓర్చుకుని ముద్దు కృష్ణమ నాయుడు పార్టీలో గుర్తింపు సాధించారు. అదే సమయంలో జిల్లాలో కూడా తనదైన ముద్ర వేశారు. చిత్తూరు జిల్లాలో తనకంటూ..ప్రత్యేక ఒరవడిని ఆయన సృష్టించారు.నగరి నియోజకవర్గం ఏర్డిన తర్వాత 2009లో తొలిసారి ఇక్కడ నుంచి గెలిచిన ముద్దు కృష్ణమ నాయుడు తర్వాత కాలంలో 2014లో ఆయన పరాజయం పాలయ్యారు. ఇక, 2019ఎన్నికల సమయానికి ఆయన కాలం చేశారు. 2014లో ఓడిపోయిన తర్వాత ముద్దు కృష్ణమ నాయుడుకు టీడీపీ అదినేత చంద్రబాబు.. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. దీంతో ఆయన మృతి చెందిన తర్వాత.. ఆయన కుటుంబానికి ఈ పదవి ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన కుమారులు ఇద్దరు, సతీమణి సరస్వతమ్మ కూడా ఈ పదవి కోసం రెడ్డెక్కారు. మొత్తంగా ఈ విషయంలో ఓ పరిష్కారానికి వచ్చి.. సరస్వతమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చారు. గత ఏడాది ఎన్నికల్లో నగరి టికెట్‌ను చంద్రబాబు గాలి కుమారుడు భాను ప్రకాశ్ కు ఇచ్చారు. అయితే, ఆయన ఓటమి పాలయ్యారు.దీంతో ఇప్పుడు ముద్దు కృష్ణమ నాయుడు కుటుంబానికి మిగిలిన ఏకైక రాజకీయ పదవి.. ఆయన సతీమణి ఎమ్మెల్సీ కావడమే. అయితే, ఇప్పుడు ఈ సీటుకు కూడా సమయం అయిపోతోంది. ఎమ్మెల్సీగా ఉన్న ముద్దుకృష్ణమ మృతితో ఖాళీ అయిన స్థానంలో ఆయ న సతీమణికి ఇచ్చినప్పడు.. మిగిలిన సమయానికి మాత్రమే ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతారు. మొత్తం ఆరేళ్లు అనుకుంటే.. సుమారు నాలుగేళ్లు ముద్దుకృష్ణమ ఆ పదవిని అనుభవించారు. మిగిలిన రెండేళ్లకే సరస్వతమ్మ పరిమితమయ్యారు. వచ్చే ఏడాది మార్చి 21తో ఆమె పదవీ కాలానికి కూడా సమయం అయిపోతుంది.దీంతో ఆమె ఈ పదవిని వదులుకుంటే.. ముద్దు కృష్ణమ నాయుడు కుటుంబానికి రాజకీయంగా ఎలాంటి పదవులు ఉండవు. మళ్లీ వచ్చే 2024 ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పుడు కూడా నగరిలో గెలుపు గుర్రం ఎక్కితేనే పదవిలోకి వస్తారు. ఇప్పుడున్న పరిస్థితిలో నగరిలో వైసీపీ ఎమ్మెల్యే రోజా దూకుడు ముందు గాలి కుటుంబం బిక్కమొహం వేస్తోందని చెప్పక తప్పదు. ఎందుకంటే గత రెండు ఎన్నికల్లోనూ ముద్దు కృష్ణమ నాయుడు కుటుంబం రోజా చేతిలో ఓడిపోయింది. ఇక ఇప్పటికే కుటుంబంలో గాలి కుమారుల మధ్య సఖ్యత లేదు. భాను ప్రకాశ్‌కు సోదరుడు, తల్లి నుంచి సహకారం ఉండడం లేదు. మరోవైపు భాను సోదరుడు జగదీశ్ పార్టీ మారతారన్న ప్రచారం కూడా ఉంది. దీనిని బట్టి వచ్చే నాలుగేళ్లపాటుఆమెను తట్టుకుని నిలబడడం అనేది సాధ్యమేనా? ఒకవేళ మళ్లీ ఓడిపోతే.. ఇక, రాజకీయంగా ముద్దు కృష్ణమ నాయుడు కుటుంబం అడ్రస్ లేకుండా పోతుందా? అనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.