కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు బినామీ పేర్లతో వ్యాపారం ప్రారంభించారు. ఈ వ్యాపారం దాదాపు కోట్లలో సాగుతున్నా... వాణిజ్యశాఖ మాత్రం కన్నులొట్టపోయి చూస్తోందనే విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. విద్యార్థులకు కావాల్సిన పాఠ్య, నోటు పుస్తకాలు, అట్టలు, పెన్నులు, పెన్సిల్, పుస్తకాలకు అతికించుకునే లేబుల్ కూడా ఆ పాఠశాలల్లోనే కొనాలి. ఇది ఆయా కార్పొరేట్, ప్రయివేటు యాజమాన్యాల నిబంధన. కొన్ని పాఠశాలల్లో అవపసరం లేని వాటిని కూడా విద్యార్థులకు అంటకడుతున్నారు. బహిరంగ మార్కెట్ ఈ సామాగ్రి అందుబాటులో ఉన్నా.. అక్కడ కొనడానికి పాఠశాలల యాజామాన్యాలు అంగీకరించడం లేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 830 ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలున్నాయి. అందులో ఎల్‌కెజీ నుంచి పదో తరగతి వరకు దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు చదువుతన్నారు. ఈ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి పుస్తకాలు, దుస్తులు, ఇతర వాటికి దాదాపు రూ. 10 వేలు ఖర్చు అవుతోంది. ప్రతి ఏటా ఇలా దాదాపు రూ. 20 కోట్ల మేర వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. వాణిజ్య పన్నుల శాఖ నిబంధన ప్రకారం రూ. లక్ష వ్యాపారానికి నెలకు రూ. ఐదు వేలు పన్ను చెల్లించాలి. కార్పొరేట్, ప్రయివేటు పాఠశాల వ్యాపారం మాత్రం జీరో దందా సాగుతోంది. బినామీ రూపంలో విద్యార్థుల నుంచి కోట్లలో వ్యాపారం జరుగుతున్నా,. ప్రభుత్వానికి పైసా ఆదాయం లేదు. నాలుగు బస్తాలు పప్పులు తెచ్చుకుని అమ్ముకుని బతికే చిరువ్యాపారుల వద్ద బిల్లులు లేవని వాణిజ్యశాఖ అధికారులు ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తారు. పైగా వారు చెల్లించాల్సిన పన్నులకు అదనంగా ఐదు చెట్లు వసూలు చేస్తారు. కాదంటే కేసులు తప్పవు. అయినా సరుకు మాత్రం తిరిగి రాదు. కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలల్లో ఇంత దర్జాగా అనుమతులు లేకుండా సాగుతున్న వ్యాపారంపై వాణిజ్యశాఖ అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదన్నది ప్రశ్న. వ్యాపారం ఎదైనా రూ. 7.5 లక్షలకు మించితే తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. క్రయ విక్రయాలకు సంబంధించి వ్యాపారం జరిగిన మొత్తంలో పన్నులు చెల్లించాలి. బిల్లులు లేక పోయినా, పన్నులు కట్టకపోయిన చర్యలు తీసుకోవచ్చు. కాని ఇవి కాగితాలకు మాటలకే పరిమితం అవుతున్నాయి. ఆచరణకు మాత్రం నోచుకోవడంలేదు. ఇదే నిజమైతే కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు అనుమతులు లేకుండా కోట్లలో జీరో వ్యాపారం చేస్తున్నా వాణిజ్య పన్నులు శాఖ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అదేమంటే విక్రయదారులు బినామీ పేర్లతో పుస్తక దుకాణాలు, వస్త్రదుకాణాల పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారని అధికారులు వాదన.