ఉపనయనం అంటే మరొక నయనం(కన్ను,నేత్రం) అని అర్థం. ఆ మూడవ నేత్రం(జ్ఞాననేత్రం) తెరచి ఉంచాలి, అందుకొరకు ప్రాణాయామము నేర్పబడుతుంది. బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఆ పిల్లవాడిని భిక్షాటనకు పంపుతారు. మొదటి భిక్ష తల్లి నుంచి తీసుకొనబడుతుంది. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు గుప్పెళ్ళు భిక్ష ఇచ్చి, ఆ బాలకుడు తండ్రి చెప్పిన బ్రహ్మోపదేశం మననం చేసుకోవటానికి శక్తిని ప్రసాదిస్తుంది. ఇక ఆ బాలుడు యాయవారములు చేస్తూ, గురువు గారి వద్దనే ఉండి విద్యాభ్యాసం చేస్తూ విద్యను అభ్యసించాలి. గురువు వద్ద ఉండి జ్ఞానము సంపాదించిన తర్వాత గురువుగారు వారి మనస్సు తాత్కాలిక విషయాలపై ఆకర్షితమవుతుందో, లేక సన్యాసం వైపు ఆకర్షితమవుతుందో తెలుసుకోవటానికి ఆ శిష్యులను తమ తల్లిదండ్రుల వద్దకు పంపేవారు. కొంత కాలం అలా తల్లిదండ్రుల వద్ద ఉన్న తర్వాత పిల్లలు సంసారిక సుఖాలను విడిచిపెట్టి కాశీకి బయలదేరేవాళ్ళు. కొంత కాలానికి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఆ పిల్లలను కాశీకి వెళ్ళకుండా ఆపి వారి కుమార్తెలను వివాహం చేసుకోమని అడిగేవారు. సన్యాసం తీసుకోవాలని ధృఢ సంకల్పం ఉన్న వారు, అవి పట్టించుకోక ముందుకు సాగేవారు, మరి కొంత మంది పెళ్ళిచేసుకుని ఇంటికి వచ్చేవారు. తండ్రి దేశాంతరమందుంటే తాత, అతను లేకుంటే తండ్రి సోదరులు వారుకూడా లేకపోతే వటుడి అన్న దానికి అధికారి అవుతాడు. ఒకవేళ అతను కూడా లేకపోతే సగోత్రమునందు పుట్టినవారు చేయాల్సిఉంటుంది. ఏ వయసులో చెయ్యాలి... బ్రాహ్మణ కులంలో 8వ సంవత్సరాన, క్షత్రియులకు 11వ ఏడున, వైశ్యులకు 12వ ఏడున ఉపనయనం చేయాలి. బ్రాహ్మణులకు చైత్ర మరియు వైశాఖ మాసాలు, క్షత్రియులకు జ్యేష్ట, ఆషాఢ మాసాలూ, వైశ్యులకు ఆశ్వయుజ కార్తీక మాసాలు మంచిది. అందరికీ పనికివచ్చే మాసాలు మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలు.
బ్రహ్మచారులలో బ్రాహ్మణులు జింక తోలుని, క్షత్రియులు కురుమృగ చర్మమును, వైశ్యులు గొర్రె తోలును, ఉత్తరీయంగా ధరించాలి. బ్రాహ్మణుడు నార బట్టలు, క్షత్రియుడు వెల్వెట్టు బట్టలు, వైశ్యుడు ఉన్ని బట్టలు ధరించాలి. బ్రాహ్మణుడైన బ్రహ్మచారి ముంజకసువుతో పేనిన సమానమైన మూడు పేటలుగల మొలత్రాడు కట్టాలి. క్షత్రియ బ్రహ్మచారి ముర్వ అని కసుపుతో చేయబడిన మొలత్రాడు కట్టాలి. వైశ్యుడు జనపనారతో చేసిన ముప్పేట గల మొలత్రాడు కట్టాలి. ముంజకసుపు దొరకనప్పుడు దర్భ, రెల్లు, తుంగ నీటితో ముప్పెరిగా చేసిన ఒక ముడి, బూడు ముళ్ళు, ఐదు ముళ్ళుగల మొలత్రాళ్ళను వరసగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య బ్రహ్మచారులు ధరించవలెను. బ్రాహ్మణుడు ప్రత్తి నూలుతోను, క్షత్రియులు జనపనారతోను, వైశ్యులు తెల్ల మేక బొచ్చుతోను పేని కుడివైపుగా చుట్టిన తొమ్మిది పోగులుగల యజ్ఞోపవీతమును భుజము నందు ధరించాలి బ్రాహ్మణుడు బిల్వము గానీ, మోదుగ గానీ దండముగా ధరించాలి. క్షత్రియ బ్రహ్మచారి మర్రి కొమ్మ గానీ, చండ్ర కొమ్మ గానీ దండముగ ధరించాలి. వైశ్య బ్రహ్మచారి జివి కొమ్మను గానీ, మేడి కొమ్మను గానీ దండముగా ధరించాలి. ఆ ముగ్గురు బ్రహ్మచారులు వరసగా కేశము వరకుని, నొసటి వరకును, ముక్కు వరకును ఉండునట్లు దండమును ధరించాలి. ఆ దండములు వంకర లేనివియు, గంట్లు గలిగింపనివియు, పై పట్టతో కూడినవియు, అగ్నిలో కాలనివై ఉండవలెను. వారు దండమును గైకొని సూర్యోపస్థానము చేసి, అగ్నికి ప్రదక్షిణము చేసి యధావిధిగా భిక్షాటనము గావించాలి.
ఉపవీతుడైన బ్రాహ్మణుడు 'భవతీ భిక్షాందేహీ అని భవ శబ్దాన్ని మొదట చెప్పి భిక్షాటన చేయాలి. ఉపవీతుడైన క్షత్రియుడు 'భిక్షాం భవతీ దేహీ అని భవ శబ్దాన్ని మధ్యన చెబుతూ భిక్షాటన చేయాలి. వైశ్య బ్రహ్మచారి 'భిక్షాం దేహి భవతీ అని భవతి శబ్దం చివరనుంచి భిక్షాటన చేయాలి. తల్లిని గాని, తల్లి తోడవుట్టిన దానిని గాని ఎవరు తనను అవమానింపదో అట్టివానిని యాచించాలి. ఈవిధంగా మధూకరము తెచ్చి వలసినంతవరకు గురువునకు మంచి అన్నమును నివేదించి, ఆతని అనుజ్ఞను పొంది యాచమించి తూర్పు ముఖంగా కూర్చుండి పరిశుద్ధుడై యవశిష్టాన్ని భుజించాలి. వేరు చింత లేకుండా భుజించి భోజనమైన పిమ్మట చేతులు, కాళ్ళు కడిక్కొని శాస్త్రరీతిని ఆచమనం కావించి నీటితో అన్ని ఇంద్రియాలు తుడుచుకోవాలి.
ఉపనయనము అంటే కేవలము మూడు వరుసల జంధ్యము వేసుకోవటం కాదు. దాని అర్థం మనకు రెండే కాదు మూడు కన్నులు ఉండాలి. ఆ మూడవ నేత్రం జ్ఞాననేత్రం. ఆ నేత్రాన్ని తెరచి నీ యొక్క నిజమైన స్వరూపాన్ని గుర్తించాలి...
|| ఓం నమః శివాయ ||