కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తగ్గించిన ధరలు ఇంత వరకు అమల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. ఎరువుల కంపెనీలు ధరలు తగ్గించి అమ్మలేమంటూ బహిరంగంగానే చెబుతున్నాయి. ధరల తగ్గింపు అటుంచి, కొన్ని కంపెనీలు ధరలను పెంచి విక్రయాలు సాగిస్తున్నాయి. పెరిగిన ధరలతో పెట్టుబడులు అధికం అయి రైతులు దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 8.63 లక్షల హెక్టార్ల పంటసాగు అవుతుందని అధికారులు అంచనాలు వేశారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రెండు లక్షల హెక్టార్ల పంట సాగు పెరిగినట్లు తెలుస్తోంది. పంట సాగుకు ప్రధాన అవసరమైన ఎరువులు ధరలు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. అధిక ధరల తగ్గింపుపై అటు ప్రభుత్వం, ఇటు వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది బస్తా యూరియాపై వంద రూపాయలు మేర పెరిగింది. వ్యాపారులు ఇష్టానుసారంగా రైతుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. అధికారుల నిఘా లేకపోవటంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. సూపర్‌పాస్పేట్, డిఎపి, 10:26:26, 14.35.14, 17:17:17 పొటాషియం వంటి రకాలపై వంద రూపాయల వరకు ధరలు పెంచి అమ్ముతున్నారు. డిమాండ్‌ను బట్టి రైతులకు అవసరమున్న వాటిపై వ్యాపారులు ధరలదందా సాగిస్తున్నారు. గోదావరి డిఎపి గతేడాది రూ.1180 ఉంటే ప్రస్తుతం రూ.1221, ఐపిఎల్ డిఎపి, 20:20-13, యూరియా తదితర రకాలు ధరలు గత ఖరీఫ్‌తో పోలిస్తే ప్రస్తుతం పెరిగాయి. ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉండడంతో వ్యవసాయశాఖ అధికారులు 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని ప్రభుత్వానికి నివేధికలు పంపి ఉన్నారు. ఇంత స్థాయిలో ఎరువుల అవసరం ఉండగా ప్రభుత్వం మాత్రం వాటి ధరలను తగ్గించేందుకు ప్రయత్నం చేయలేదు. ఫలితంగా కరువు రైతులపై కోట్లాది రూపాయలు భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎరువుల ధరలను తగ్గించి విక్రయాలు సాగించేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం నేతలు కోరుతున్నారు.నిర్ణయించిన ధరలకంటే అధిక ధరలకు ఎరువులను అమ్మితే వ్యాపారుల లైసెన్స్‌లు రద్దు చేస్తాం. నకిలీ ఎరువులపై క్షేత్ర స్థాయిలో దృష్టి సారించాం. ఎరువుల వాడకంపై అంచనాలు పెద్దగా ఉన్నా డ్రిప్ కారణంగా కాస్త తగ్గింది. వ్యాపారులు విక్రయించే ఎరువుల నాణ్యత వంటి విషయాలపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. రైతులు ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటారు