విజయవాడ జూలై 14
అంబేద్కర్ ఇంటిని కూల్చివేయడాన్ని నిరసిస్తూ విజయవాడలో కాంగ్రెస్ నేతలు అందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్, నరహరశెట్టి నరసింహారావు, డాక్టర్ గంగాధర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శైలాజానాథ్.. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని కులాల్లో పేదలపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు. మనువాదులారా ఖబడ్దార్.. హద్దులు దాటి వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకుంటారంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ చర్యకు నిరసనగా ఎపి వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ‘మీరెన్ని (బీజేపీ) కుట్రలు చేసినా అంబేద్కర్ భావజాలాలను ప్రజల నుంచి తీయలేరు. బీజేపీ ప్రభుత్వం కూడా ఇటువంటి వారిని ప్రోత్సహించడం మానుకోవాలి. ఈ కేసును దేశ ద్రోహం కింద పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇదే అంశంపై రాష్ట్రపతి, ప్రధాని, మహారాష్ట్ర సీఎంకు లేఖలు రాస్తున్నాం’ అని శైలజానాథ్ చెప్పుకొచ్చారు.