తిరుమల, జూలై 15,
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని శ్రీవారిని కోరుతూ తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో మంగళవారం సాంగోపాంగ అష్టాక్షరీ, ద్వాదశాక్షరీ మహాసుదర్శన సహిత విశ్వశాంతిహోమం నిర్వహించారు. ఈ సందర్భంగా "ఓం నమో నారాయణాయ" అష్టాక్షరి మంత్రాన్ని, "ఓం నమో భగవతే వాసుదేవాయ" ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపించి హోమం నిర్వహించారు. ఈ యాగంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.
వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ కరోనా వ్యాధి నుండి మానవాళిని రక్షించాలని స్వామివారిని కోరుతూ వేదపాఠశాలలో ప్రతిరోజూ వేదపారాయణం జరుగుతోందన్నారు. మంగళవారం అశ్విని నక్షత్రం కలిసిన భౌమాశ్విని యోగం పర్వదినం కావడంతో విశ్వశాంతి హోమాన్ని పూర్ణాహుతితో పూర్తి చేశామన్నారు. ఇందులోభాగంగా ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేద పారాయణం, దివ్య ప్రబంధ నారాయణం, శ్రీ వేంకటాచల మహాత్మ్యం, శ్రీమద్రామాయణ పారాయణం, సుందరకాండ పారాయణం, శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్ర పారాయణం, శ్రీ దుర్గా సప్తశతి పారాయణం చేపట్టినట్టు చెప్పారు.