అమరావతి జులై 15,
ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు, చేతివృత్తుల వారికి ప్రత్యేక ప్యాకేజి అందించాలి. ఇళ్ల స్థలాలకు భూసేకరణలో, మెరక వేయడంలో వైసిపి స్కామ్ లను ప్రజల్లో ఎండగట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే వారం టిడిపి వర్ట్యువల్ యాజిటేషన్లకు సిద్దం కావాలన్నారు. టిడిపి ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులతో చంద్రబాబు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘కరోనా నుంచి రికవరీలో రాష్ట్రం అట్టడుగున ఉండటం బాధాకరం. యాక్టివ్ కేసులలో దేశంలో 5వ స్థానంలో ఏపి ఉండటం ఆందోళనకరం. మరణాల రేటులో 2వ స్థానానికి రాష్ట్రం ఉండటం శోచనీయం. గత నెల రోజుల్లో రాష్ట్రంలో వైరస్ గ్రోత్ రేటు 91.2%, మరణాల్లో 70% గ్రోత్ రేటు ఉండటం గమనార్హమని అన్నారు.
రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వేలాది శాంపిల్స్, కిట్స్ వృధా చేయడం ఘోరవైఫల్యం. ప్రకాశం జిల్లాలోనే 27వేల శాంపిల్స్, కిట్స్ వృధా చేశారు. మిగతా జిల్లాల్లో 2 లక్షల పైగా శాంపిల్స్, కిట్స్ వృధా అయ్యాయి. కరోనా టెస్టింగ్ రిజల్ట్స్ లో కూడా గందరగోళం చేస్తున్నారు. పాజిటివ్ ను నెగటివ్ గా, నెగటివ్ ను పాజిటివ్ గా ఫలితాలతో ప్రజల్లో అయోమయం సృష్టించారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి టెస్టింగ్ రిజల్ట్ ఒక ఉదాహరణ. కరోనా వైరస్ నియంత్రణలో, టెస్టింగులలో, క్వారంటైన్ కేంద్రాల నిర్వహణలో, నాణ్యమైన ఆహారం పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని అన్నారు.
రిజల్ట్స్ ఇవ్వడానికే 20రోజులు పడితే ఇంకేం నియంత్రిస్తారు వైరస్ ను..? లక్షల పరీక్షలు చేశామని గొప్పలు చెప్పడం కాదు, వైరస్ టెస్టింగ్ రిజల్ట్స్ ఎంత త్వరగా ఇస్తున్నారు..? వారాల తరబడి టెస్టింగ్ రిజల్ట్స్ లో జాప్యం వల్లే ఏపిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీనికి వైసిపి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రాష్ట్రంలో కరోనా చికిత్సపై వైసిపి మంత్రులకే నమ్మకం లేదు. డిప్యూటి సీఎం అంజాద్ బాషా, తిరుపతి ప్రభుత్వాసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి, హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట. మృత దేహాలను ప్రొక్లెయిన్లతో విసిరేయడం, అంబులెన్స్ లు రాక నడిరోడ్డు మీదే మరణాలు వైసిపి వైఫల్యాలకు నిదర్శనాలని విమర్శించారు. ట్రంప్ లాంటి వ్యక్తే చివరికి మాస్క్ ధరించారు, మాస్క్ కూడా పెట్టుకోని జగన్ ఏం సందేశం ఇస్తున్నారు ప్రజలకని అన్నారు.
క్వారంటైన్ సెంటర్లలో నాసిరకం భోజనం పంపిణీని ప్రజలే నిరసిస్తున్నారు. రోజుకు ఆహారం కింద రూ 500 చెల్లిస్తున్నా కంపుగొట్టే ఆహారం అందించడం అమానుషం. క్వారంటైన్ సెంటర్లలో రోగులకిచ్చే ఆహారంలో కూడా అవినీతికి పాల్పడటం గర్హనీయం. టిడిపి ప్రభుత్వం అన్నా కేంటిన్లలో అతి తక్కువ ధరకే నాణ్యమైన శుచికరమైన భోజనం అందిస్తే, క్వారంటైన్ కేంద్రాల్లో రోగులకు కూడా వైసిపి ప్రభుత్వం సరైన ఆహారం అందించక పోవడం ఘోర వైఫల్యం. ఈ పరిస్థితుల్లో టిడిపి ప్రభుత్వం ఉంటే ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించేది, ముందు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెంచేది, ఉపశమన చర్యలు చేపట్టేది, బాధితులకు అండగా ఉండేదనే భావన ప్రజల్లో ఉందని అన్నారు. టిడిపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే మాస్క్ లు అడిగిన డాక్టర్లపై దాడులు చేసే పరిస్థితి ఉండేదా..? పిపిఈల కోసం డాక్టర్లు, వైద్య సిబ్బంది ధర్నాలు చేసే దుస్థితి ఉండేదా..? క్వారంటైన్ కేంద్రాల్లో ఆకలి కేకలు ఉండేవా..? నాసిరకం ఆహారం క్వారంటైన్ కేంద్రాల్లో పంపిణీ జరిగేదా..? అనేదానిపై అన్నివర్గాల్లో ప్రజల్లో చర్చ జరుగుతోంది. కరోనా నియంత్రణ కన్నా కక్ష సాధించడంపైనే వైసిపి దృష్టి పెట్టింది. ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేసి, తప్పుడు కేసులతో ప్రతిపక్ష నాయకులపై కక్ష తీర్చుకోవాలని చూస్తోంది. తప్పులను చెబితే దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. టిడిపి కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు, దాడులపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.
కరోనా లాక్ డౌన్ లతో లక్షలాది వలస కార్మికులు, చేతివృత్తులవారు, భవన నిర్మాణ కార్మికులు, రోజుకూలీలు ఉపాధి కోల్పోయారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజి ప్రకటించినా రాష్ట్రం నుంచి అదనంగా చేసిన సాయం శూన్యం. ప్రతి పేద కుటుంబానికి రూ5వేలు ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేసినా స్పందన లేదు. కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజి తీసుకున్నారు గాని, రాష్ట్రం నుంచి అదనంగా ప్రత్యేక ప్యాకేజి ఇవ్వలేదు. పనులు లేక ఆదాయం కోల్పోయిన పేదలకు అండగా ఉండాల్సిన సమయం ఇది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే పేదలకు మద్దతుగా వచ్చే వారం రోజుల్లో వర్ట్యువల్ ఆందోళనలు జరపాలి.
ఇళ్ల స్థలాలకు భూసేకరణలో, మెరక వేయడంలో, నరేగా నిధుల వినియోగంలో భారీ అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ9వేల కోట్లలో రూ5వేల కోట్లు స్వాహా చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల భూసేకరణలో రూ2వేల కోట్లు, లెవెలింగ్ లో రూ3వేల కోట్ల దోపిడీ చేశారు. వైసిపి స్కామ్ లపై వచ్చే వారం రోజుల్లో వర్ట్యువల్ ఆందోళనలు జరపాలి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ప్రజా సమస్యలపై ఆందోళనల్లో పాల్గొనాలని అన్నారు. అవినీతికి అవకాశం ఉన్నచోటే అప్పు తెచ్చిన డబ్బు ఖర్చు చేస్తున్నారు. వాటాలు వేసుకుని పంచుకుంటున్నారని అయన అన్నారు.