YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ధర్మాన కొత్త ఆయుధం

ధర్మాన కొత్త ఆయుధం

శ్రీకాకుళం, జూలై 15, 
శ్రీకాకుళం జిల్లా అనగానే పోరాటాల పురిటిగడ్డ అని గుర్తుకువస్తుంది. అక్కడే నక్సల్స్ ఉద్యమం పుట్టింది. ఇక స్వాతంత్ర సంగ్రామంలోనూ ఈ జిల్లా పాత్ర ఎన్నదగినది. అటువంటి సిక్కోలు నుంచి వచ్చిన నాయకులు కూడా గట్టిగానే ఉంటారు. వారి మాటల్లో ఆ పోరాట స్పూర్తి కనిపిస్తుంది. ఇదంతా ఎందుకంటే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గురించే. ఆయన అధికార పార్టీలో ఉన్నా విపక్షంలో ఉన్నా కూడా పచ్చి మిరపకాయే. ఇక ఎవరినీ లెక్కచేయక తనదైన రీతిలో పనిచేసుకుని పోతూంటారు. జగన్ కి పులివెందుల కంచుకోట కావచ్చు. ఆయన వచ్చి శ్రీకాకుళంలో గెలవగలరా అన్న ప్రశ్న బహుశా వైసీపీలో ధర్మాన ప్రసాదరావు కాక మరొకరు వేయగలరా. అంతటి గట్స్ ఉన్న నేత కాబట్టే తరచూ వివాదాలు వస్తున్నా కూడా ఎక్కడా నోటికి బ్రేక్ వేయడంలేదు.ఇపుడు తాజాగా ధర్మాన ప్రసాదరావు కొత్త జిల్లాల విషయంపై దాదాపుగా గర్జించినంత పనిచేశారు. మీ ఇష్టం వచ్చినట్లుగా జిల్లాలను విడగొట్టుకుని పోతే మళ్ళీ ఉద్యమాలు వస్తాయి. అవి కూడా ఏపీ విభజ‌న నాటి పోరాటాలుగా మారుతాయి అంటూ ఏకంగా జగన్ కే గట్టి హెచ్చరికలు పంపించారు. అసలు పార్లమెంట్ సీటుని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనుకోవడంలో హేతుబధ్ధత ఏముంది అంటూ ఆయన వైసీపీ సర్కార్ నే నిలదీశారు. ఇలా చేయడం వల్ల శ్రీకాకుళం జిల్లాలోని అభివృధ్ధి చెందిన ప్రాంతమంతా పోయి విజయ‌నగరంలో కలుస్తుంది. అలా మేము ఎప్పటికీ వెనకబడిన జిల్లాగానే మిగిలిపోవాలా అని ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతే కాదు ధర్మాన ప్రసాదరావు మరో మాట కూడా అన్నారు. జిల్లాల విభజన అన్నది అభివ్రుధ్ధికి సంకేతంగా పాలనకు సులువుగా ఉండాలి తప్ప అసంబద్ధ విభజన వల్ల కొత్త చిచ్చు రేగకూడదు అని హెచ్చరిస్తున్నారు. అలాంటి నిర్ణయాలు కనుక తీసుకుంటే మనకు మనమే విపక్షానికి అవకాశాలు ఇచ్చిన వారము అవుతామని కూడా ఆయన స్పష్టం చేశారు. వైసీపీ సర్కార్ ఈ విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయాలని కూడా ధర్మాన ప్రసాదరావు సూచిస్తున్నారు. ఆదరాబాదరాగా జిల్లాల విభజన అన్నది కూడదని, దీని వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని ఈ సీనియర్ నేత కుండబద్దలు కొడుతున్నారు.అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లాకు అన్యాయం జరిగితే ఆ ప్రజల తరఫున నిలబడాల్సివస్తుందని కూడా ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. అంటే పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లాను రెండు ముక్కలు చేస్తే మాత్రం అదే ఆయుధంగా చేసుకుని అధికార పార్టీ మీదకే దాడి చేసేందుకు తాను రెడీ అంటున్నారు ధర్మాన. మరి ధర్మాన ప్రసాదరావు చెప్పిన దానికి అధికార పక్షం ఇరుకునపడుతూండగా విపక్ష తెలుగుదేశంలో మాత్రం జోష్ కనిపిస్తోంది. వారు శభాష్ ధర్మానా అంటున్నారు. గట్స్ ఉన్న నేతగా ధర్మాన ప్రసాదరావు ధర్మంగానే చెప్పారని, దాన్ని కాదని జగన్ సర్కార్ జిల్లాను విడగొట్టాలని చూస్తే ఉద్యమిస్తామని విపక్ష నేతలు అంటున్నారు. మొత్తానికి ధర్మాన ప్రసాదరావు విపక్షానికి కోరి కోరి అవకాశం ఇచ్చేలా ప్రకటనలు చేస్తున్నారని వైసీపీలో ఓ వైపు విమర్శలు వస్తున్నాయి. అయితే జగన్ మొండితనం తెలిసే ధర్మాన ప్రసాదరావు ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారని, ఈ లెక్కన కనుక గట్టిగా చెప్పకపోతే జిల్లా నష్టపోతుందని కూడా అదే వైసీపీలోనే మరో వాదన వినిపిస్తోంది. మొత్తానికి ధర్మాన ప్రసాదరావుకు ఒక కొత్త ఆయుధం దొరికింది. మరి ఈ సమస్యను జగన్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

Related Posts