YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

*ఉన్నతులు*

*ఉన్నతులు*

ఏ పనిచేస్తే ప్రజలకు ఉపకారం జరుగుతుందో, లోకానికి మేలు చేకూరుతుందో, ఏ పని ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తుందో- ఆ పనిని ఉన్నతమైనదిగా నలుగురూ ప్రశంసిస్తారు. ఆ పని చేసిన వ్యక్తిని లోకం సదా గుర్తుంచుకొంటుంది, స్మరించుకుంటుంది. ఉన్నతుడని కీర్తిస్తుంది. సందర్భం వచ్చినప్పుడల్లా సమాజం ఇలాంటివారి పట్ల గౌరవభావాన్ని ప్రదర్శిస్తుంది.
మానవ మనుగడకే కాకుండా సమస్త ప్రాణులూ బతకడానికి కావలసిన సకల పదార్థాలనూ సమకూర్చే భూమాతకు రోజూ నిద్రలేచాక కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తూ మంచం మీద నుంచి మన పాదాలను నేల మీదికి దించుతాం. భూమాత ఔన్నత్యాన్ని స్మరించుకుంటాం. సర్వకాల సర్వావస్థలయందు సకల జీవుల్నీ సంరక్షించే సర్వేశ్వరుడు సర్వోన్నతుడు. లోకేశ్వరుడి లక్షణ స్వభావాన్ని మానవులమైన మనం ఒంటపట్టించుకొని పరోపకారానికి నడుం బిగించాలి. పంచభూతాలలో ఒకటైన నేలతల్లి కూడా తన శక్తినంతటినీ సకల జీవులకు ధారపోస్తూనే ఉంది. తనలో నిక్షిప్తమైవున్న లోహాలు, చమురు మొదలైన పదార్థాలు ప్రజలకు నిరంతరం ఇస్తూనే ఉంది. భూదేవికి గల ఈ దాతృత్వమే ఆ తల్లి ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. సకల జీవులకూ ప్రాణవాయువును అందిస్తున్న వాయువు, ప్రాణసమానమైన నీటిని ఇస్తున్న వరుణుడు, వేడిమినిస్తున్న అగ్ని... వీళ్లంతా లోకాలను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉన్నందువల్ల ఉన్నతులయ్యారు. పంచభూతాల్లోంచి ఆవిర్భవించి వారికి వారసులమైన మనమంతా ఆ ఔదార్యాన్ని, లోకోపకార గుణాన్ని పుణికిపుచ్చుకోవాలి. సమస్త ప్రాణికోటికీ సేవలు అందిస్తూ ఉండాలి. వారిలాగా మనం కూడా ఉన్నతులమనిపించుకోవాలి.
గోదావరి నది మీద ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించి కాలవల ద్వారా నీటిని సరఫరాచేస్తూ ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు సాగునీటికి తాగునీటికి కొరతలేకుండా చేసి అన్నపానీయాలను అందించి మహోన్నతుడయ్యాడు కాటన్‌ దొర. ప్రజల ఆకలిదప్పులను తీర్చడంలో తమ ధనప్రాణాలను సైతం అర్పించిన సహృదయులు, ఉదారులు ఎంతోమంది ఉన్నతులుగా లోకంలో విఖ్యాతిగాంచారు. ప్రాచీన భారతదేశంలో శిబి చక్రవర్తి, రంతిదేవుడు, దధీచి మొదలైనవారు పరుల కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఉన్నతులుగా ప్రసిద్ధిచెందారు.
నిటారుగా, ఉన్నతంగా ఎదిగివున్న చెట్ల కొమ్మలు పండ్ల భారంతో కిందికి ఒదిగి ఉంటాయి. ప్రజలకు, పక్షులకు తమ ఫలాలను ఆహారంగా అందిస్తాయి. ఆకలిని తీరుస్తాయి. ఇతరులకు సేవచేస్తూ చెట్లు తమ ఔన్నత్యాన్ని నిరూపిస్తున్నాయి. మనం పొలాల్లో ఏతంతో నీరు తోడుతున్న రైతును చూస్తాం. నీటిని బయటకు తెచ్చే ఏతంమాను చేస్తున్న పని వల్ల పొలం చక్కని పంటనిచ్చి ప్రజలకు ఉపకారం చేస్తోంది. ఏతంమానులాగే శక్తిమంతుడు, సమర్థుడు అయిన వ్యక్తి ఏ కారణం చేతనో ఎదుటివారి ముందు తలదించుకోవలసి వచ్చినా అతడిని అసమర్థుడని భావించరాదని పెద్దలు చెబుతారు. అతడు తన ఔన్నత్యాన్ని చాటుతూ- మళ్లీ  నలుగురిలో మన్ననలందుకొనే ఘనకార్యాలు చేస్తూనే ఉంటాడు.
ఈనాటి బాలలే రేపటిపౌరులు అని మనం భావిస్తాం. పెద్దవారయ్యాక ఆ బాలలు మంచి పౌరులుగా అందరి మన్ననలు పొందగలిగినప్పుడే గదా మన ఈ భావన సార్థకమవుతుంది. అందువల్ల పిల్లల్ని సాకే తల్లి, బిడ్డలను పాఠశాలకు పంపి విద్యాబుద్ధులు చెప్పించే తండ్రి తమ కర్తవ్యాలను చక్కగా నిర్వర్తించాలి. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలతోపాటూ లోకజ్ఞానం, పారమార్థిక విషయాలను కూడా బోధిస్తారు. పిల్లలూ తమ గురువులు చెప్పిన విషయాలను ఒంటపట్టించుకొని పెద్దవారయ్యాక ఉత్తమపౌరులకు ఉండవలసిన లక్షణాలతో సమాజంలో మెలిగినట్లయితే- తల్లిదండ్రులు, గురువుల శ్రమ ఫలిస్తుంది. ఉన్నత మార్గంలో పయనించే తమ పిల్లల్ని చూసి లోకం ప్రశంసిస్తుంది. సమాజ ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకొని తమ కర్తవ్యాలను నిర్వర్తించిన వారే ఉత్తమ, ఉన్నత పౌరులు కాగలుగుతారు.

Related Posts