బెంగళూర్, జూలై 15,
కరోనా వైరస్ మహమ్మారి వల్ల మళ్లీ సైకిల్స్‌కు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. లాక్‌డౌన్‌తో చాలా జిమ్స్ మూతపడ్డాయి. ప్రజారవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఫ్యామిలీస్ కూడా ఎంత సేపూ ఇంట్లోనే ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ సమయంలో చాలా ఏళ్ల తర్వాత సైకిల్ సేల్స్‌కు ఊపు వచ్చింది. కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కొచ్చి, ముంబై లాంటి నగరాల్లో ప్రజలు ఎక్కువగా సైకిళ్లనే తమ ట్రాన్స్ పోర్ట్ సాధనంగా వాడుతున్నారు. ఎక్కడికి బయటికి వెళ్లాలన్నా సైకిళ్లపైనే వెళ్తున్నారు. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అమెరికా, బ్రిటన్‌లలో కూడా సైకిల్ సేల్స్ పెరిగాయి. అమెరికాలో వాల్‌మార్ట్, టార్గెట్ వంటి స్టోర్లలో సైకిల్స్ ఖాళీ అయ్యాయి. ప్రజలందరూ ఎగబడి మరీ సైకిల్స్‌ను కొనేస్తున్నారు. ఇండిపెండెంట్ షాపుల వారి వద్ద కూడా అఫర్డబుల్ ఫ్యామిలీ బైక్స్ అవుటాఫ్ స్టాక్ అయినట్టు తెలిసింది.అమెరికాలో 1970లో ఆయిల్ సంక్షోభం నెలకొన్నప్పటి నుంచి సైకిల్ సేల్స్ ఈ రెండు నెలల్లో బాగా పెరిగినట్టు సైకిల్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అనాలసిస్ చేసే హ్యుమన్ పవర్డ్ సొల్యుషన్స్ జాయ్ టౌన్లీ చెప్పారు. హ్యాండ్ శానిటైజర్లకు, టాయిలెట్ పేపర్లకు ఎలా డిమాండ్ వచ్చిందో.. సైకిల్స్‌కు కూడా అదే మాదిరి క్రేజ్ వచ్చినట్టు టౌన్లీ తెలిపారు. ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు వెల్లడించారు. కార్లు ఎక్కువగా తిరిగే నగరాలుగా మనీలా, రోమ్‌లలో కూడా సైకిల్స్ సేల్స్ పెరిగిపోయాయి. సైకిల్స్‌కు పెరిగిన డిమాండ్‌తో వీటికి కూడా రోడ్లపై ప్రత్యేకంగా లైన్లు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేయడానికి కాస్త సమయం పడుతుందని, దీంతో ‘పాప్‌అప్’ సైకిల్ లేన్లను ఏర్పాటు చేస్తామని ఢిల్లీప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేకంగా సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేయడంతో సేఫ్టీని మెరుగుపర్చవచ్చని డబ్ల్యూఆర్‌ఐ ఇండియా ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ డైరెక్టర్ అమిత్ భట్ తెలిపారు. ఢిల్లీలో మాదిరి, కోల్‌కతాలో కూడా సైకిల్ సేల్స్ పెరిగాయి. సిటీ సైకిల్ స్ట్రీట్ మళ్లీ తన రూపు తెచ్చుకుంటోంది. గతకొన్ని దశాబ్దాలుగా బెంటింగ్ స్ట్రీట్‌లోని సైకిల్ స్టోర్లలో పడిపోయిన సేల్స్, ఈ నెలలో బాగా పుంజుకున్నాయని తెలిసింది. సైకిల్స్ కొనే వారిలో ఐటీ ప్రొఫెషినల్స్, బ్యాంక్ ఎంప్లాయీస్, టీచర్స్, డాక్టర్లు, ఆర్టిస్ట్ లు ఉన్నారు. సైకిల్స్‌కు ప్రస్తుత మొచ్చిన క్రేజ్‌తో వీటి కొరత ఏర్పడింది. ఒకవేళ సైకిల్ కొనాలంటే కొన్ని వారాలు లేదా నెలలు ఆగాల్సిందేనని తెలుస్తోంది. ఇండియాలో సైకిల్స్ రేట్లు రూ.6 వేల నుంచి రూ.80 వేల మధ్యలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం వస్తోన్న డిమాండ్‌తో భవిష్యత్‌లో రోడ్లపై చాలా వరకు సైకిల్సే కనబడనున్నాయని కంపెనీలు చెబుతున్నాయి.దేశాలు, రాష్ట్రాలు తమ బోర్డర్లను మూసివేయడం, వ్యాపారాలు మూతపడటం, ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ అయినప్పటి నుంచి అంటే మార్చి మధ్య నుంచి సైకిల్స్ సేల్స్‌కు రష్ పెరిగింది. బస్సులు, సబ్‌వేలు మూతపడటంతో చాలా మంది వర్కర్లు ఇతర ప్రత్యామ్నాయాలు కోసం చూశారు. ఒకవైపు ఆటోలు, క్యాబ్‌ల రేట్లు పెరిగాయి. ఈ క్రమంలో ప్రజలు సురక్షితమైన ట్రాన్స్‌పోర్ట్ సాధనంగా సైకిళ్లను ఎంచుకుంటున్నారు. ప్రజలు జిమ్‌లకు వెళ్లేఛాన్స్ లేకపోవడంతో, ఎక్సర్ సైజ్‌గా సైకిల్స్‌ను భావిస్తున్నారు. ఇండ్లలోనే ప్రజలు స్ట్రక్ కావడంతో, పిల్లలను ఇంట్లోనే ఆడించడానికి ఈ సైకిల్స్‌ను కొంటున్నా రు. వివిధ స్పోర్ట్స్ యాక్టివిటీల్లో ఉన్న తమ పిల్లలకు పేరెంట్స్ సైకిల్స్ కొంటున్నారు. కరోనాతో ఈ–సైకిల్స్‌కు బూమ్ వచ్చింది. కరోనా మొదలైనప్పటి నుంచి ఈ–బైక్‌లకు ఎక్కువ డిమాండ్ వచ్చింది. ఒక్క రోజు డెలివరీ దొరికితే చాలు అన్న స్థితి నుంచి 10 వారాల ఆర్డర్‌ను ఒకేసారి పొందినట్టు ఈ–బైక్ కంపెనీలు చెప్పాయి. కరోనాతో ప్రజలు ప్రజారవాణా వ్యవస్థద్వారా బయటికి వెళ్లడానికి లేదని, దీంతో ఎలక్ట్రిక్ ఈ–సైకిల్స్ కొనేందుకు చూస్తున్నారన్నారు.