తిరుపతి, జూలై 15
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూలై 16 నుండి 18వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. ఇందుకోసం బుధవారం సాయంత్రం అంకురార్పణ సందర్భంగా ఉదయం జరిగిన ఆచార్య ఋత్విక్ వరణంలో టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. బుధవారం సాయంత్రం అంకురార్పణ జరుగనుందన్నారు. పవిత్రోత్సవాల్లో భాగంగా జూలై 16న పవిత్ర ప్రతిష్ట, జూలై 17న పవిత్ర సమర్పణ, జూలై 18న పూర్ణాహుతి జరుగుతాయన్నారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మధ్యహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ఆలయంలో పవిత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తారని చెప్పారు.