YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు తొలి అడుగు

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు తొలి అడుగు

హైదరాబద్ జూలై 15 
భారత ప్రభుత్వ ఐసీఎంఆర్- భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ సంయుక్తంగా చేపట్టిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు తొలి అడుగు పడింది. హైదరాబాద్ లోని నిమ్స్ లో ఆరుగురు వలంటీర్లు ముందుకు వచ్చారు. వారి నుంచి మంగళవారం రక్తనమూనాలు సేకరించారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్ టీకాకు సంబంధించి ఇప్పటికే పలు ప్రయోగాలు చేశారు. మనుషులపై ప్రయోగాలకు ఇటీవలే ఆమోదం లభించింది. దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ కు 12 ఆస్పత్రులు ఎంపిక కాగా.. అందులో హైదరాబాద్ లోని నిమ్స్ కు అవకాశం లభించింది.మంగళవారం నిమ్స్ లో ఆరుగురు వలంటీర్ల రక్త నమూనాలు సేకరించారు. వీటిని ఢిల్లీలోని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కు పంపారు. అక్కడ పరీక్షించి నిమ్స్ కు నివేదిక పంపిస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారిపై తొలుత ఒక డోసు వ్యాక్సిన్ ప్రయోగిస్తారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో వారి ఆరోగ్య పరిస్థితులను అంచనావేస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకున్నాక వలంటీర్లను ఇళ్లకు పంపిస్తారు.ఎప్పటికప్పుడు వలంటీర్ల ఆరోగ్యంలో మార్పులను నమోదు చేసుకుంటారు. రెండు రోజుల్లోనే క్లినికల్ ట్రయల్స్ కు అవసరమైన వ్యాక్సిన్ రానుందని సమాచారం. మొత్తం 60మంది వలంటీర్లు అవసరం అవుతారని వైద్యులు తెలిపారు.

Related Posts