YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సచివాలయ కూల్చివేతపై విచారణ వాయిదా

సచివాలయ కూల్చివేతపై విచారణ వాయిదా

హైద్రాబాద్, జూలై 16,
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత వ్యవహారంపై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. భవనాల కూల్చివేతపై స్టే రేపటి వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై అదనపు నివేదిక సమర్పించాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. ఈ క్రమంలో పర్యావరణ అనుమతులకు సంబంధించిన కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను సమర్పిస్తామని ఏజీ తెలిపారు. అయినా, భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని చెబుతున్నాయని ఆయన గుర్తు చేశారు.అయితే, ప్రభుత్వ కౌంటర్‌కు పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ కౌంటర్ కూడా దాఖలు చేశారు. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం 2018కి విరుద్ధంగా కూల్చివేత పనులు చేపడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వెల్లడించారు. ఒక ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి లీగల్ రీజర్వ్‌మెంట్స్ తీసుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. లీగల్ రిజర్వ్‌మెంట్స్‌పై వివరణ ఇవ్వాలని, పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం ఏం చెబుతుందో తెలపాలని కోర్టు సూచించింది.భవనాల కూల్చివేతకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. ఒక ప్రాజెక్టు నిర్మించడానికి మాత్రమే అక్కడి నుంచి అనుమతి అవసరమని ఏజీ కోర్టుతో అన్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం భవనాలు కూల్చివేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ అనుమతి తీసుకోవాలని, సంబంధిత శాఖ అనుమతి తీసుకున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. భవనాల కూల్చివేతకు అనుమతి అవసరం లేదని, కేవలం భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి అవసరమని కోర్టుకు ఏజీ తెలిపారు.ఈ క్రమంలో నూతన నిర్మాణాలు చేపట్టేటప్పుడు అందుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకుంటామని ఏజీ చెప్పారు. జీహెచ్ఎంసీ, లోకల్ అథారిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనుమతులు ఉన్నాయని అన్నారు. సొలిసిటర్ జనరల్ గురువారం విచారణకు హాజరు కావాలని హైకోర్టు అదేశించింది. తదుపరి విచారణను గురువారానికి హైకోర్టు వాయిదా వేసింది.

Related Posts