హైద్రాబాద్, జూలై 16,
కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్‌లో సైబర్ నేరాలు బాగా పెరిగాయని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో మహిళలు, పిల్లల కోసం సురక్షితమైన సైబర్ ప్రపంచం లక్ష్యంగా నెల రోజుల పాటు జరిగే ఆన్‌లైన్ ప్రచారం ‘సైబ్ హర్’ అనే కార్యక్రమాన్ని డీజీపీ బుధవారం ఆన్‌లైన్ వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు. సైబర్ నేరాలు జరిగే తీరు, జాగ్రత్తగా ఉండాల్సిన చర్యల గురించి ఇంటర్నెట్ వినియోగదారులకు మరింత అవగాహన కలిగించేలా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు డీజీపీమహేందర్ రెడ్డి తెలిపారు.తెలంగాణ మహిళా భద్రతా విభాగం నిర్వహిస్తున్న ఈ ప్రచారానికి యునిసెఫ్ ఇండియా అవసరమైన సహకారాన్ని అందిస్తోందని డీజీపీ చెప్పారు. ఆన్‌లైన్ ముప్పు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మహిళలు, పిల్లలకు అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యాస రచన, గ్రూప్ డిస్కషన్స్ వంటి ఇతర కార్యక్రమాలను సైతం చేపడతామని డీజీపీ వెల్లడించారు. క్రీడలు, సినిమా రంగం, న్యాయ రంగం, సైకాలజిస్టులు, సైబర్ క్రైం నిపుణులు, విద్యార్థులు ఈ సైబ్ హర్ ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు.