విజయవాడ, జూలై 16,
రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పార్టీని పటిష్టం చేయాల్సిన నాయకగణం.. ఇంచార్జ్ పీఠాల కోసం.. ఇతర పార్టీ పదవుల కోసం రగడ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీకి అంతో ఇంతో పట్టున్న కృష్ణాజిల్లా మచిలీ పట్నం(బందరు) నియోజకవర్గంలో ఈ రగడ రోడ్డున పడింది. బందరు టీడీపీలో ఎప్పటికప్పుడు సమీకరణలు విచిత్రంగా ఉంటాయి. 1994లో ఇక్కడ నుంచి అంబటి బ్రాహ్మణయ్య విజయం సాధించారు. ఇక్కడ కాపు వర్గం డామినేషన్ ఎక్కువ. ఆ తర్వాత జరిగిన 1999 ఎన్నికల్లో ఆయన మచిలీపట్నం ఎంపీగా పోటీ చేశారు. దీంతో మచిలీపట్నం ఎమ్మెల్యేగా మత్స్యకార వర్గానికి చెందిన నడికుదిటి నరసింహారావు పోటీ చేశారు. తొలి ప్రయత్నం లోనే ఆయన విజయం సాధించారు. అదే సమయంలో ఆయనకు చంద్రబాబు తన కేబినెట్‌లో అవకాశం కల్పించారు. ఇక, ఆ తర్వాత ఎన్నికల్లో అంటే.. 2004లో నడికుదిటి ఓడిపోయారు.ఆ తర్వాత 2009లో నరసింహారావు అల్లుడు కొల్లు రవీంద్ర టీడీపీ టికెట్‌పై ఇదే మచిలీపట్నం స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన కొల్లు రవీంద్ర తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం ఆయన కూడా చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. కాపు వర్గానికి పట్టున్న బందరులో నడికుదిటి, రవీంద్ర ఇద్దరు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వెంటనే మంత్రి పదవులు పొందడం అంటే కేవలం కుల సమీకరణలే వాళ్లకు వరం అయ్యాయని చెప్పక తప్పదు. ఇక రవీంద్ర 2014 నుంచి గత ఏడాది ఎన్నికల వరకు కూడా మంత్రిగా కొనసాగారు. ఇక, గత ఏడాది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇటీవల ఆయన ఓ హత్యా కేసులో జైలుకు వెళ్లారు.ప్రస్తుతం మంత్రిగా ఉన్న పేర్ని నాని అనుచరుడు మేకా భాస్కరరావు హత్య కేసులో రవీంద్రను అరెస్టు చేసి జైలుకు తరలించారు. రవీంద్ర అరెస్టు తర్వాత మచిలీపట్నం రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడ ఈ స్థానంపై కన్నేసిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలు ఈ సీటును దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే యాదవ సామాజిక వర్గానికి చెందిన అర్జునుడు గత నాలుగు సార్లుగా బందరు ఎమ్మెల్యే సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి సారి క్యాస్ట్ ఈక్వేషన్‌లోనే ఆయనకు సీటు మిస్ అవుతోంది. ఈ సారి మాత్రం వచ్చిన అవకాశం వదులుకోకూడదన్న ప్లాన్‌లో ఆయన బందరు టీడీపీని తన కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక ఇదే సీటుపై మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ కుటుంబం కూడా ఎప్పటి నుంచో కన్నేసి ఉంది. 2009 ఎన్నికల నుంచే వీరు ఈ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మత్స్యకార వర్గానికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండడం, ఎక్కడో ఒక చోట అవకాశం ఇవ్వాల్సి ఉండడంతో మచిలీ పట్నంలో కొల్లు రవీంద్రకు చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఇప్పుడు హత్యా కేసులో ఇరుక్కోవడంతో అటు కొనకళ్ల నారాయణ తన కుమారుడికి ఈ సీటును రిజర్వ్ చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కొనకళ్ల కుటుంబం గత ఎన్నికల్లోనే అటు పెడన లేదా ఇటు బందరు అసెంబ్లీ సీటు దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసింది.అయితే చంద్రబాబు మాత్రం కొనకళ్ల నారాయణ బందరు ఎంపీగా రెండుసార్లు వరుసగా గెలవడంతో ఆయనకే సీటు ఇచ్చారు. ఇక ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో పాటు కొల్లు రవీంద్ర హత్య కేసులో ఇరుక్కోవడంతో దీనినే అదనుగా తీసుకునేందుకు కొనకళ్ల ఫ్యామిలీ రెడీ అవుతోంది. అర్జునుడు వర్సెస్ కొనకళ్ల కుటుంబాలు బందరు టీడీపీ రాజకీయాన్ని నడిపించేందుకు నడిపిస్తోన్న ఈ ఆధిపత్య పోరులో ఏం జరుగుతోందో ? చూడాలి.