విజయవాడ, జూలై 16,
రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే తరహా వాతావరణం ఉండదు. ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పడం కష్టం. ఇప్పుడు అలాంటి పరిస్థితే.. ఎదుర్కొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. కృష్ణాజిల్లాలోని నందిగామ నుంచి రెండుసార్లు, మైలవరం నియోజకవర్గం నుంచి మరో రెండు సార్లు ఆయన వరుస విజయాలు సాధించారు. అయితే, ఇదంతా తన ఒక్కడి వల్లే జరిగిందని, తనను చూసి మాత్రమే ప్రజలు ఓట్లు వేశారని ఆయన భావిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ కేడర్‌ను చులకనగా చూడడం, తన సామాజిక వర్గాన్ని కూడా దూరం చేసుకోవడం పరిపాటిగా మారింది. నిజానికి రెండు సార్లు ఇక్కడ నుంచి వరుసగా ఆయన విజయం దక్కించుకున్నారు.ఇక ఆయన ప్రస్తుత నియోజకవర్గం మైలవరం విషయానికి వస్తే 2009లో ఒకసారి.. 2014లో ఒకసారి మైలవరం నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నా రు. అయితే, 2014లో ఆయన గెలిచినా కూడా తనకు ఏడు వేల మెజారిటీనే వచ్చిందని, క్షేత్రస్థాయిలో నాయకులు తనకోసం కృషి చేయలేదని, తన కృషి మాత్రమే ఫలించదని ఆయన చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన స్థానికంగా నియోజకవర్గంలోని నాయకులను ఆయన గుర్తించలేదు. అంతేకాదు వారికి అందుబాటులో కూడా లేకుండా పోయారు. ఆ ఎన్నికల్లో ఓ వైపు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుంటే మరో వైపు దేవినేని ఉమా చాలా రౌండ్లలో వెనకపడడంతో స్థానిక నాయకులపై తీవ్ర అసహనానికి గురవ్వడంతో పాటు అక్కడే ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆ తర్వాత మంత్రి అయ్యాక చాలా మంది కీలక నేతలను ఐదేళ్ల పాటు పూర్తిగా పక్కన పెట్టి వారికి నరకం చూపించారు. ఏ పని కానివ్వలేదు. దీంతో అప్పట్లోనే దేవినేని ఉమపై వ్యతిరేకత వచ్చింది. ఇది గత ఏడాది ఎన్నికల్లో ప్రభావం చూపించింది. మంత్రిగా ఉండి ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. దేవినేని ఉమ పెట్టిన ఇబ్బందులు భరించలేని వారంతా గతేడాది ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో ఇక్కడ నుంచి వైసీపీ నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్ విజయం దక్కించుకున్నారు. అయితే, ఈ ఏడాది కాలంలో ఇప్పుడు తన ఓటమికి కారణాలను పరిశీలించుకున్న దేవినేని ఉమ తాను ఎవరినైతే.. పక్కన పెట్టాడో.. వారిని దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలా మంది కేడర్ గెలుపు గుర్రం ఎక్కిన వసంత కృష్ణప్రసాద్‌కు అనుకూలంగా మారిపోయి.. ఆయన వర్గంగా చలామణి అవుతున్నారు. మిగిలిన వారిలో కొందరు.. ఎంపీ కేశినేని నాని వర్గంగా ఉన్నారు. వారు తమ సమస్యలను అటు ఎమ్మెల్యేకు, ఇటు ఎంపీకి చెప్పుకొంటున్నారు. ఇక జిల్లాలోనూ ఆయన్ను పట్టించుకుంటోన్న టీడీపీ నాయకులు ఎవ్వరూ లేరు. దీంతో లబోదిబో మంటున్న దేవినేని ఉమ తన తప్పు తెలుసుకున్నానని అంటున్నారు. ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్లడంతో పాటు చివరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడితే కూడా తానున్నానంటూ నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. అయినా కేడర్ ఆయనను పట్టించుకోకపోవడం గమనార్హం. మొత్తానికి దేవినేని ఉమలో మార్పు గమనిస్తోన్న వారు అంతా ఆయనలో మార్పు వచ్చిందని.. అయితే ఇది మళ్లీ పదవి వచ్చే వరకేనా ? శాశ్వతంగా ఉంటుందా ? అని గుసగుసలాడుకుంటున్నారు.