అమరావతి జూలై 16
ఆరోగ్యశ్రీ పథకంలో మరో అడుగు ముందుకు వేస్తున్నాం. వైద్యం ఖర్చు వేయి దాటితే.. పేదవాడికి ఉచితంగా చికిత్స అందాలని మరో అడుగు ముందుకు వేస్తున్నాం. దీనికోసం ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతంగా పెంచామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం నాడు తాడేపల్లిలోకి క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన అయన మనం అధికారంలోకి వచ్చేనాటికి 1059 చికిత్సలు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండేవి. అదికూడా ఏ ఆలనాపాలనా లేని పరిస్థితిలో ఆరోగ్య శ్రీ ఉండేది. నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.680 కోట్ల బకాయిలు పెట్టిన పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ మారుస్తూ మార్పు దిశగా అడుగులు వేశామని అన్నారు. అలాగే కరోనా కట్టడి చర్యలపై కలెక్టర్లు మరింత దృష్టిపెట్టాలని అన్నారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకూ అన్ని జాగ్రత్తలూ పాటిస్తూ కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు. కరోనాపై ప్రజలలో చైతన్యం కల్పించాలన్నారు. కరోనా సోకితే వెంటనే మందులు వాడితే తగ్గిపోతుందన్నారు. ఆరోగ్యశ్రీపై సీఎం మాట్లాడుతూ మనస్ఫూర్తిగా పేదవాడికి అండగా ఉండాలని అడుగులు వేశాం. అధికారంలోకి రాగానే రూ. 680 కోట్ల బకాయిలు నెట్ వర్క్ ఆస్పత్రులకు చెల్లించాం. పేదవాడు గర్వంగా తలెత్తుకుని వైద్యం తీసుకుని చిరునవ్వుతో ఇంటికి రావాలన్న ఉద్దేశంతో చర్యలు తీసుకున్నాం. ఎలాంటి జాప్యం లేకుండా ఆరోగ్యశ్రీ బిల్లులన్నీ గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తున్నాం. 1059 చికిత్సలు గతంలో ఉంటే.. వాటిని 2200 చికిత్సలవరకూ ఆరోగ్యశ్రీ కింద తీసుకు వచ్చాం. జనవరిలో ప.గో. జిల్లాలో పైలట్ప్రాజెక్టుగా శ్రీకారం చుట్టాం. ఇవాళ 2200 చికిత్సలకు పెంచి, మరో 6 జిల్లాల్లో వర్తింపు చేస్తున్నామని అన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత 1059 చికిత్సలకు మరో 200 చికిత్సలు పెంచి.. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశాం. ఇందులో క్యాన్సర్, డై కాక్లియర్ ఇంప్లాంట్ లాంటి వాటన్నింటినీ తీసుకువచ్చాం. పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం 2059కి, తర్వాత 2200 చికిత్సలు పెంచి పైలట్ప్రాజెక్టు కింద చేపట్టాం. ఇప్పుడు మరో 6 జిల్లాల్లో 2200 చికిత్సలను ఆరోగ్యశ్రీ కింద తీసుకు వస్తున్నాం. ఆరోగ్య శ్రీలో మరో మైలు రాయి ఇదని అయన అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏప్రిల్ 6న కరోనాను ఆరోగ్యశ్రీ కింద తీసుకు వచ్చినరాష్ట్రం మనదే. ఇతర రాష్ట్రాలకు మనం స్ఫూర్తిగా నిలిచాం. 1088 సంఖ్యలో 108, 104 అత్యాధునిక సదుపాయాలున్న అంబులెన్స్లను మనం ప్రారంభించాం. ప్రతి మండలంలో కూడా సేవలు అందించడానికి ఈ చర్యలు తీసుకున్నాం. రాష్ట్రంలో ప్రతి కుటుంబం చల్లగా ఉండాలని, వైద్యం ఖర్చులకు ఇబ్బందిపడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. చికిత్స తీసుకున్న తర్వాత కూడా విశ్రాంతి సమయంలోకూడా ఇబ్బందులు పడకూడదని రోజుకు రూ.225లు చొప్పున లేదా నెలకు రూ.5వేల వరకూ మనం డబ్బులు వైయస్సార్ ఆరోగ్య ఆసరా కింద ఇస్తున్నాం. దేవుడి దయంతో, మీ అందరి చల్లని దీవెనలతో మనం గొప్పగా చేయగలుగుతున్నాం. వైద్యం అన్నది సరైన సమయంలో అందకపోతే మనిషి బతకడు. వైద్యం కోసం ఏ మనిషీ కూడా అప్పులు పాలు కాకూడదు. రూ.5లక్షల ఆదాయం ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకు వచ్చాం. నెలకు రూ.40వేలు సంపాదించే వ్యక్తిని కూడా ఆరోగ్యశ్రీ కింద చేర్చాం. 1.4కోట్లకు పైగా ఆరోగ్యకార్డులను పంపిణీచేస్తున్నాం. 4 లక్షల కార్డులు తప్ప.. మిగతావన్నీకూడా పంపిణీ చేశారు. మిగిలినవి కూడా త్వరలోనే పంపిణీచేస్తున్నారు. ఆరోగ్య డేటా అంతా కూడా స్టోర్ చేసి.. ప్రతి రికార్డుకూడా అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఆరోగ్య రంగంలోకి పూర్తిగా మార్పులు చేర్పులు చేస్తున్నామన్నారు.
ఆస్పత్రులన్నీ కూడా నాడు – నేడుతో రూపు రేఖలు మారుస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పుడు 11 టీచింగ్ ఆస్పత్రులు మాత్రమే ఉన్నాయి. కొత్తగా మరో 16 టీచింగ్ ఆస్పత్రులను కట్టబోతున్నాం. జాతీయ ప్రమాణాల స్థాయిలో ఆస్పత్రులను నిర్మిస్తున్నాం. దాదాపు రూ.16వేల కోట్లు దీనికోసం ఖర్చు చేస్తున్నాం. ప్రతి నెట్ వర్క్ ఆస్పత్రికీ గ్రేడింగ్ ఇచ్చాంజ గ్రేడింగ్లో పాస్ అయిన ఆస్పత్రినే నెట్ వర్క్ ఆస్పత్రిగా గుర్తింపు నిచ్చాం. ఇవన్నీ ఒకవైపున చేస్తూనే.. దేవుడి దయతో.. మరో ముఖ్యమైన పనిచేయగలుగుతున్నాం. ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు తీసుకుంటే... వాటి నాణ్యతమీద సందేహాలు, భయాలు ఉన్న పరిస్థితివుంది. అలాంటి భయాన్ని తొలగించాం. డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులను మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్నామని అన్నారు.