తిరుమల, జూలై 16
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారంనాడు సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగార్‌స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
ముందుగా ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు.
అనంతరం శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్ పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగార్, ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంటవచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు.