హైదరాబద్ జూలై 16
నక్కలు కూడా మనుషులు చనిపోయాక పూడ్చిపెట్టిన తర్వాతే పీక్కుతుంటాయి. కానీ ఇప్పుడు మెడికల్ మాఫియా బతికి ఉండగానే మనుషులను పీక్కుతింటోందని బాధితులు ఆరోపిస్తున్నారు. అవును.. తాజాగా కరోనా భయం జనాన్ని ఆవహించింది. చనిపోతామనే భయంతో ఆస్తులు అమ్మి అయినా సరే చికిత్స తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు కూడబెట్టిందంతా ఆస్పత్రుల బిల్లు ఖర్చులకే తగలేస్తున్నారు. ఈ భయమే ఇప్పుడు మెడికల్ మాఫియా పాలిట వరంగా మారిందంటున్నారు. కరోనా ను క్యాష్ చేసుకుంటూ కొన్ని కోట్ల రూపాయల దందా చేస్తున్నారట మెడికల్ మాఫియా.. *ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటూ ఊదరకరోనా భయాన్ని మెడికల్ మాఫియా క్యాష్ చేసుకుంటోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా రాకుండా ఇది అడ్డుకుంటుందని.. రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చాలా మందులు మార్కెట్లోకి వచ్చాయి. మల్టీ విటమిన్లు వేసుకోవాలని.. ఇమ్యూనిటీ బస్టర్స్ ద్రావణాలంటూ.. ఇక ప్రకృతి పరమైన తులసీ ఇతర వంటింటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసి మాత్రలంటూ టీవీలు వెబ్ సైట్లు సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. వీటిని తీసుకుంటే మీ ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పడంతో అందరూ ఎగబడి వేలకు వేలు పోసి కొంటున్నారు. తింటున్నారు. ఇదంతా ఒట్టి మోసం అని వైద్యులు అంటున్నారు. కరోనా భయాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.శానిటైజర్లు హ్యాండ్ వాషులు మాస్క్ లకు లెక్కేలేదు..ఇక కరోనాకు ముందు మన మార్కెట్లో డెటాల్ లైఫ్ బాయ్ సావలాన్ అంటూ పేరొందిన నాలుగైదు బ్రాండ్ల హ్యాండ్ వాషులు శానిటైజర్లు మాత్రమే మార్కెట్లో దొరికేవి. కానీ ఇప్పుడు అవేవీ మార్కెట్లో కనిపించడం లేదు. అడిగితే కరోనాతో కొరత అంటున్నారు. ఇక వీటి స్థానంలో పేరు ఊరు.. మ్యాను ఫాక్చర్ డీటైల్స్ లేకుండా ఇబ్బడి ముబ్బడిగా మార్కెట్లోకి శానిటైజర్లు హ్యాండ్ వాషులు వచ్చేశాయి. ఇది కోట్ల రూపాయల దందా కొనసాగుతోంది. ఇక కరోనాకు ముందు మాస్క్ లు కేవలం వైద్యులు మాత్రమే వాడేవారు. కావాల్సిన వారు ఎన్95 మాస్కులను 300 రూపాయలకు పైగా వెచ్చించి కొనేవారు. కానీ ఇప్పుడు అదే ఎన్95 మాస్కులు మార్కెట్లో కుప్పలు తెప్పలు. ఏ మెడికల్ షాపులో చూసినా.. రోడ్డుపక్కన కేవలం 40 రూపాయల నుంచి దొరుకుతున్నాయి. నాణ్యతలేవు.. కరోనాను నియంత్రించవు. ఇలా జనాల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.మనుషుల రక్తం పీల్చే జలగల మాదిరిగా ఇలాంటి విపత్తు వేళ మెడికల్ మాఫియా దోచుకుంటోందని బాధితులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ లో ఇటీవల ఆస్పత్రిలో 5వేలకు దొరికే రెమెడిసివిర్ ఇంజెక్షన్ ను 70వేల నుంచి లక్ష వరకు డిమాండ్ ను బట్టి బయట మార్కెట్లో కొన్ని మెడికల్ ఏజెన్సీలు బ్లాక్ చేసి అమ్ముతున్నాయంటున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి రోగులు ఎంతపెట్టైనా కొంటున్నారు. ఈ దందాను ఇటీవలే హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ గుజరాత్ ముంబై మెడికల్ డ్రగ్ మాఫియాలు హైదరాబాద్ లోని కొన్ని మెడికల్ ఏజెన్సీలతో కుమ్మక్కై రెమెడిసివిర్ సహా కరోనా మందులను వేలల్లో వాటిని లక్షలకు అమ్ముతూ కోట్లు గడిస్తున్నాయి. ఇప్పటికీ హైదరాబాద్ సహా అంతటా ఈ దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. కరోనా మందులు మార్కెట్లో బ్లాక్ చేస్తూ వేలు లక్షలకు అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నారు. ఈ మెడికల్ మాఫియా దందాను ప్రభుత్వాలు చెక్ పెట్టాలని రోగులు కోరుతున్నారు