విజయవాడ, జూలై 17,
ఎవరైనా అధినేతను ధిక్కరిస్తే మండుతుంది. ఎంత కాదనుకునన బీ ఫారం ఇచ్చి ప్రచారం చేసి అధినేత గెలిపిస్తాడు. సరే అందులో ఎంతో కొంత అభ్యర్ధి బలం కూడా ఉంటుందనుకున్నా ఇపుడున్న రాజకీయ వాతావరణంలో ప్రజలు ఎక్కువగా చూసేది అభ్యర్ధుల కంటే పార్టీ నాయకులనే. లేకపోతే ఎంత సమర్ధుడైన నేత అయినా బలమైన పార్టీ నుంచే పోటీ చేయాలనుకుంటాడు కానీ జనమే లేని పార్టీ కొమ్ముకాయడు కదా. ఇక ఏపీలో ఇపుడు మూడు ప్రధాన పార్టీలకూ సొంత పార్టీల నుంచే అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోంది. అయితే అధినేతలు వారిని ట్రీట్ చేసే విధానంలో మాత్రం తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ళి జగన్ తో కలిస్తే చంద్రబాబు ఒక్క వల్లభనేని వంశీనే సస్పెండ్ చేసి ఊరుకున్నారు. కరణం బలరాం, మద్దాల గిరి బాబుని ఎంత తిడుతున్నా చూసీ చూడనట్లుగానే ఉన్నారు. దాంతో వారు టెక్నికల్ గా టీడీపీ మెంబర్స్ గానే ఉన్నారు.ఇక జనసేనకు ఏకైక ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ గెలిచారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి గెలిచి మొనగాడు అనిపించుకున్నారు. అయితే ఆయన గెలిచిన తరువాత నుంచి అధినేత పవన్ కల్యాణ్ ను అసలు ఖాతరు చేయడంలేదు. మరో వైపు పవన్ కి కూడా తాను ఓడి ఆ ఎమ్మెల్యే గెలవడం హర్ట్ అయినట్లుగా ఉందని అంటున్నారు. దాంతో ఇద్దరి మధ్యన గ్యాప్ ఏర్పడింది. రాపాక అయితే ఏకంగా నిండు అసెంబ్లీలో జగన్ని పొగడమే కాదు, రాసుకుపూసుకు తిరిగుతున్నారు. ఇక రాజ్యసభ ఎన్నికల్లో నేరుగా వైసీపీ అభ్యర్ధికే ఓటేశారు. ఇది ఆయన బాహాటంగా మీడియాకు చెప్పారు కూడా. అయినా సరే పవన్ కల్యాణ్ కనీసం ఇదేమని అడగలేదు.నిజానికి పవన్ కల్యాణ్ మీద ఈగ వాలితే ఆయన వీరాభిమానులు రెచ్చిపోతారు. ఇక పవన్ సైతం తనను వైసీపీ మంత్రులు ఒక్క మాట అన్నా కూడా గట్టిగా రివర్స్ అటాక్ ఇస్తారు. అలాంటిది తన పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే గీత దాటుతూంటే, తనను చులకన చేస్తూంటే కిమ్మనకుండా ఉండడం పైన పార్టీలోనే కాదు, రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. జనసైనికులైతే రాపాక మీద ఎందుకు పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోవడం లేదని గట్టిగానే గుస్సా అవుతున్నారు. ఆ ఎమ్మెల్యే ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్లుగా కూడా వారు సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతూ తమ ఆగ్రహాన్ని చాటుకుంటున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం వదిలేసినట్లుగా ఉంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ వచ్చింది. జగన్ మీద ఆయన విమర్శలు చేశారు. దాంతో వైసీపీ ఆయన మీద అనర్హత వేటుని ప్రయోగిస్తోంది. ఆయన మీద క్రమశిక్షణా చర్యలకు దిగుతోంది. ఇది చూసిన జనసైనికులు మరింతగా మండుతున్నారట. తమ పార్టీ అధినేతను రాపాక విమర్శిస్తున్నా ఎందుకు పవన్ కల్యాణ్ మౌనంగా ఉంటున్నారో అర్ధం కావడం లేదని వారు వాపోతున్నారు. పవన్ కి ధైర్యం లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇకనైనా పవన్ కల్యాణ్ కూడా రాపాక మీద చర్యలు తీసుకుంటే అధినేతగా ఆయనకు మరింత విలువ పెరుగుతుందని కూడా అంటున్నారు. మరి పవన్ కల్యాణ్ మాత్రం ఎందుకో వెనకా ముందాడుతున్నారు. దానికి మొదటి కారణం ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతే జనసేన అన్న పిలుపు ఈ అసెంబ్లీలో అసలు వినబడదని, మరోటి ఆయన దళిత ఎమ్మెల్యే కావడంతో ఆ ప్రభావం తన రాజకీయాల మీద పడుతుందని అంటున్నారు. మొత్తానికి ఏపీలో జగనే రెబెల్స్ పాలిట పగవాడుగా మారుతున్నారు కానీ మిగిలిన రెండు పార్టీల అధినేతలు మాత్రం చోద్యం చూస్తున్నారు అంటున్నారు.