విశాఖపట్టణం, జూలై 17,
కరోనా వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచుతారు. చుట్టూ వైరస్ వచ్చిన రోగులు. దగ్గుతూ తుమ్ముతూ వ్యాధి తీవ్రతను బట్టి పరిసర వాతావరణం భయానకంగా ఉంటుంది. భార్య బిడ్డలు, అమ్మానాన్నలు, స్నేహితులు ఎవ్వరు ఉండరు. వైద్యులు, సిబ్బంది సైతం ఎప్పుడో ఒకసారి దర్శనం ఇచ్చి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం వైరస్ తీవ్రతను బట్టి మందులను మార్చడం వంటివి చేస్తూ ఉంటారు. చికిత్స పొందుతున్న వార్డ్ లో ఈ లోపు ఎవరైనా మరణిస్తే అక్కడ ఉన్న వారి గుండెలు జారిపోతూ ఉంటాయి. తమ వంతు కూడా రాబోతోందా అనే ప్రాణభయంతో రోగులు దిగాలు పడిపోతూ ఉంటారు. ఒకరికి మరొకరు ధైర్యం చెప్పుకునే ప్రయత్నం కొందరు చేస్తున్నా మరికొందరు తీవ్ర మానసిక వత్తిడిలో కొట్టుమిట్టాడతారు.తాజాగా విశాఖపట్నం కరోనా రోగులు ఉన్న వార్డ్ లో గోల గోలగా మారింది. ఇంతకీ విషయం ఏమిటి అంటే పాజిటివ్ రోగులంతా సూపర్ స్టార్ కృష్ణ సినిమాలో పాటలు పెట్టుకుని డ్యాన్స్ లు చేస్తూ ఆనందంగా ఊగిపోయారు. ఇది నెట్టింట్లో వైరల్ గా మారింది. అలాగే మరికొన్ని సెంటర్స్ లో పాజిటివ్ రోగుల పేకాట, క్యారమ్స్, చెస్ వంటివి ఆడుకుంటూ ఒకరికొకరు తోడుగా ఒంటరి తనం దూరం చేసుకుంటూ హ్యాపీ గా ఉంటున్నారు. ఈ వీడియోలను తమ బంధువులకు, స్నేహితులకు వారు పంపడం అవి చూసి వారికి ధైర్యం వస్తుంది.ఆ తరువాత ఇవి సోషల్ మీడియా ద్వారా అందరిని అలరిస్తున్నాయి. ఇక ఢిల్లీ లో క్రేజీవాల్ సర్కార్ కరోనా రోగి బర్త్ డే ను అక్కడి వార్డ్ లో నిర్వహించి అక్కడివారిలో జోష్ నింపింది. ఇలా ఇప్పుడు విపత్కాలం నుంచి మనకి మనమే బయటపడి వైరస్ పై పోరాటానికి రోగులు సిద్ధం కావడం నెగిటివ్ ఫీలింగ్స్ నుంచి వారిని దూరం చేసినట్లే. ఆనందం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందంటారు. ఇలా సమస్య ను మరిచి సంతోషంగా రోగులు గడపగలిగితే అతి తొందరగా కోలుకుంటారని వైద్య వర్గాలు సైతం అంటున్నాయి.