YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హైద్రాబాద్ లో గులాబీ గుబులు

హైద్రాబాద్ లో గులాబీ గుబులు

హైద్రాబాద్, జూలై 17, 
తెలంగాణ‌లో రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం రాజ‌కీయం కీల‌క ప్రాంతం. రాజ‌ధానిలో ప‌ట్టు నిరూపించుకోవాల‌ని అన్ని పార్టీలూ ప్ర‌య‌త్నిస్తుంటాయి. సుమారు కోటి మంది జ‌నాభా నివ‌సించే హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప్ర‌జ‌ల్లో రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌. దీంతో న‌గ‌ర ప్ర‌జ‌ల తీర్పు ఎప్పుడూ విల‌క్ష‌ణంగానే ఉంటుంది. 2016 ఫిబ్ర‌వ‌రిలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగాయి. మొత్తం 150 స్థానాల్లో 99 స్థానాల‌ను ద‌క్కించుకొని గ్రేట‌ర్ పీఠాన్ని సింగిల్‌గానే కైవ‌సం చేసుకుంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మ‌ళ్లీ జ‌న‌వ‌రిలో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది.అయితే క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఈ ఎన్నిక‌లపై ఎక్కువ‌గా ప‌డ‌బోతోంది. కేవ‌లం ఎన్నిక‌లు జ‌రిగే తేదీనే కాదు, ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను, పార్టీల గెలుపోట‌ముల‌ను కూడా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం శాసించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. నిజానికి గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌ను ఈ సంవ‌త్స‌ర‌మే నిర్వ‌హించాల‌ని కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం భావించింది. అసెంబ్లీ ఎన్నిక‌లు, మున్సిప‌ల్‌, పంచాయ‌తీ, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యాల‌తో దూకుడు మీదున్న టీఆర్ఎస్ జీహెచ్ఎంసీలోనూ మ‌ళ్లీ జెండా ఎగ‌రేయాల‌ని అనుకుంది.గ్రేట‌ర్ హైద‌రాబాద్‌పై మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ త‌న మార్క్ చూపిస్తున్నారు. హైద‌రాబాద్‌పై ఆయ‌న ప్ర‌త్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. భార‌త‌దేశానికి ఐటీ హ‌బ్‌గా ఎదుగుతున్న హైద‌రాబాద్ న‌గ‌రాన్ని విశ్వ‌న‌గ‌రంగా అభివృద్ధి చేసేందుకు ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో కేటీఆర్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. గ‌త జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఘ‌న విజ‌యానికి కూడా కేటీఆర్ ప్ర‌ధాన కార‌ణం. ఆయ‌నే టీఆర్ఎస్ ప్ర‌చార బాధ్య‌త‌లు పూర్తిగా స్వీక‌రించి అన్ని డివిజ‌న్లు తిరిగి టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. నిజానికి అంత‌కుముందు 2009లో జ‌రిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ క‌నీసం పోటీ కూడా చేయ‌లేదు. అటువంటి 2016లో 99 సీట్ల‌తో జీహెచ్ఎంసీ పీఠాన్ని టీఆర్ఎస్ ద‌క్కించుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కేటీఆర్.రెండోసారి జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించాల‌నేది టీఆర్ఎస్ ఆలోచ‌న‌. ఈ బాధ్య‌త‌లు ఈసారి కూడా కేటీఆర్ తీసుకోనున్నారు. ఈ ఏడాది చివ‌ర్లో ఎన్నిక‌లు పూర్తి చేయాల‌ని అనుకున్నారు. కానీ, క‌రోనా వైర‌స్ ఈ ప్ర‌య‌త్నాల‌కు బ్రేకులు వేసింది. ప్ర‌భుత్వం భావించిన‌ట్లుగా ఈ ఏడాది చివ‌ర్లో జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు పెట్టే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రికి జీహెచ్ఎంసీ ప‌ద‌వీకాలం ముగియ‌నుంది. అప్పుడు కూడా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గితేనే ఎన్నిక‌లు జ‌రుగుతాయి. లేదంటే మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలే ఉన్నాయి.అయితే, క‌రోనా వైర‌స్ ప్ర‌భావం గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఎక్కువ‌గా ఉంది. రాష్ట్రంలో న‌మోద‌వుతున్న మొత్తం క‌రోనా కేసుల్లో స‌గానికి పైగా గ్రేట‌ర్‌లోనే న‌మోద‌వుతున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా ఉండ‌టంతో న‌గర ప్ర‌జ‌ల్లో ఒక ర‌క‌మైన ఆందోళ‌న నెల‌కొంది. చాలా మంది న‌గ‌రానికి బ‌తుకుదెరువు కోసం ప‌ల్లెల నుంచి వ‌చ్చిన ప్ర‌జలు తిరిగి వారి స్వ‌గ్రామాల‌కు చేరుకుంటున్నారు. న‌గ‌రంలో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి చేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌వుతుంద‌నే భావ‌న కూడా న‌గ‌ర ప్ర‌జ‌ల్లో వ్య‌క్తమ‌వుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లోనూ ఇది టీఆర్ఎస్ విజ‌యావ‌కాశాల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్నాయి.గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా ఉంద‌ని ఇంటెలిజెన్స్ సైతం ప్ర‌భుత్వానికి నివేదిక ఇచ్చింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ముందు అనుకున్న‌ట్లుగా గ‌డువు లోగానే నిర్వ‌హించ‌డం సంగ‌తి అటుంచితే పాల‌క‌వ‌ర్గం గ‌డువు తీరిన త‌ర్వాత కూడా నిర్వ‌హించే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. క‌రోనా ప్ర‌భావం పూర్తిగా త‌గ్గాక‌నే ప్ర‌భుత్వం ఈ ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం ఉంది. నిజానికి, న‌గ‌రంలో మాత్రం అభివృద్ధి ప‌నులు బాగానే జ‌రుగుతున్నాయి. జీహెచ్ఎంసీ చేప‌ట్టిన ఎస్ఆర్డీపీ ద్వారా స్కైవేలు, అండ‌ర్ పాస్‌లు, కొత్త రోడ్లు పెద్ద ఎత్తున నిర్మిస్తోంది. ఇంకా అనేకానేక అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయి.కానీ, క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంలో ప్ర‌భుత్వం ఫెయిల్ అయింద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంటే ఈ అభివృద్ధి ప‌నులు టీఆర్ఎస్‌ను గెలిపించే అవ‌కాశాలు త‌క్కువే. పైగా గ‌తంలోలా ఇప్పుడు ఏక‌ప‌క్షంగా ఫ‌లితాలు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. గ్రేట‌ర్‌లో మెజారిటీ డివిజ‌న్లు సికింద్రాబాద్‌, మ‌ల్కాజ్‌గిరి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ఉన్నాయి. వీటిల్లో సికింద్రాబాద్‌ను బీజేపీ, మ‌ల్కాజ్‌గిరిని కాంగ్రెస్ గెలుచుకుంది. కాబ‌ట్టి, ఈ రెండు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ రెండు పార్టీల ప్ర‌భావం ఎక్కువ ఉండే అవ‌కాశం ఉంది. ఇవ‌న్నీ బేరీజు వేసుకుంటే ప్ర‌స్తుత పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు వాయిదా ప‌డే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

Related Posts