YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం విదేశీయం

ట్విట్టర్ లో పెద్ద హ్యాకింగ్

ట్విట్టర్ లో పెద్ద హ్యాకింగ్

వాషింగ్టన్, జూలై 17, 
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ప్రముఖుల, దిగ్గజ సంస్థల ఖాతాలు హ్యాక్‌‌కు గురయ్యాయి. ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేసి.. వారి పేరుతో ట్వీట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. బిట్‌ కాయిన్ స్కామ్‌కు ప్రయత్నించారు. వెంటనే బిట్‌కాయిన్స్‌ పంపితే, అందుకు రెట్టింపు మొత్తాన్ని తిరిగి పొందవచ్చని హ్యాకర్లు ఆ ఖాతాల్లో పేర్కొన్నారు.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్స్ అభ్యర్థి జో బిడెన్, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్‌ సహా పలువురు ప్రముఖుల ఖాతాలను ఈ విధంగా హ్యాక్ చేశారు.అలాగే, యాపిల్, ఉబెర్ సంస్థలతో పాటు హిప్-హాప్ మొగల్ కాన్యే వెస్ట్, న్యూయార్క్ నగర మాజీ మేయర్‌, బిలియనీర్ మైక్ బ్లూమ్‌బర్గ్ వంటి వారి ఖాతాలు కూడా హ్యాకర్ల బారినపడ్డాయి. జెమిని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్, కాయిన్ ఎంబేస్ యాప్‌, టైలర్ వింక్లివోస్ వంటి క్రిప్టో సంస్థల ఖాతాలను హ్యాక్ చేశారు.తొలుత టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఖాతాలో బిట్‌ కాయిన్‌ స్కామ్‌కు పాల్పడేందుకు హ్యాకర్లు చేసిన ట్వీట్లు కనపడ్డాయి. ఆ తర్వాత వెంటనే బిల్‌గేట్స్‌ ఖాతాలోనూ ఇటువంటి ట్వీట్లే కనిపించాయి. ‘ఈ ట్వీట్‌ను బిల్‌గేట్స్‌ చేయలేదు. ట్విట్టర్‌లో తలెత్తిన లోపం కారణంగా ఈ ట్వీట్లు కనపడినట్లు తెలుస్తోంది’ అని బిల్‌గేట్స్‌ ప్రతినిధి రికోడ్స్‌ టెడ్డీ తెలిపారు.ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేసిన విషయాన్ని గుర్తించిన ట్విట్టర్‌ వెంటనే రంగంలోకి దిగింది. వారి ఖాతాలను కాసేపు నిలిపేసి, ఆ ఖాతాల్లో హ్యాకర్లు చేసిన ట్వీట్లను తొలగించింది. ఈ విషయాన్ని తమ 'ట్విట్టర్ సపోర్ట్‌' ఖాతాల్లో ట్విట్టర్‌ సంస్థ వివరించింది. కొన్ని ఖాతాల్లో ఇటువంటి ట్వీట్లు వస్తున్నాయని, తాము దీనిపై చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది.ట్విట్టర్‌ సంస్థకు ఇదో క్లిష్టమైన రోజని, ఇలా ఎందుకు జరిగిందో నిర్ధారించుకునేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ సీఈవో జాక్‌ డోర్సే తెలిపారు. ఈ లోపాన్ని సరిచేసేందుకు ట్విట్టర్‌ బృందం తీవ్రంగా శ్రమిస్తోందని ఆయన తెలిపారు. కాగా, గతంలోనూ కొందరు ప్రముఖుల ఖాతాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడంతో అప్పట్లో వాటిని కొంతసేపు నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ప్రముఖుల ఖాతాలు హ్యాకర్లబారిన పడ్డాయి.

Related Posts