YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రావి చెట్టును పూజించుట వలన కలుగు ఫలితములు.

రావి చెట్టును పూజించుట వలన కలుగు ఫలితములు.

అశ్వత్ధ వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండపురాణము లో నారదుడు వివరించెను. అశ్వత్ధమే నారాయణస్వరూపము. ఆ వృక్షం యొక్క:
మూలము – బ్రహ్మ
దాని మధ్య భాగమే – విష్ణువు
దాని చివరి భాగము – శివుడు
కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే.
ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కునగల కొమ్మలలో ఇంద్రాదిదేవతలు, సప్తసముద్రాలు, అన్ని పుణ్యనదులు ఉంటాయి.
దాని వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మలు, నాలుగువేదాలు ఉంటాయి. అశ్వత్ధ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిపతులు, దిక్పాలకులు ఎల్లప్పుడు ఉంటారు.
అశ్వత్ధ వృక్షం మూలములో ‘అ’ కారము, మానులో ‘ఉ ‘ కారము, అదిఇచ్చే పళ్ళలో ‘మ’ కరము, వెరసి ఆ వృక్షమంతా ప్రణవస్వరూపమే .అశ్వత్ధ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షము.
ప్రదక్షణ మరియు పూజించు విధానము..
ముందుగా అశ్వత్ధ వృక్షాన్ని దర్శించి దానిని చేతితో తాకి( శనివారం మాత్రమే తాకాలి) ఈ క్రింది అశ్వత్ధ వృక్ష స్తోత్రమును పఠించాలి..
అశ్వత్ధవృక్ష స్తోత్రం..
మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతో విష్ణురూపిణే
అగ్రత శ్శివరూపాయ
వృక్షరాజయతే నమః
అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ చైత్ర, ఆషాడ, పుష్య మాసాలలో చేయరాదు. గురు,శుక్ర మౌడ్యాలలో చేయరాదు. కృష్ణపక్షంలో అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ ప్రారంబించరాదు. ఆది,సోమ,శుక్రవారాలలో, గ్రహణ మరియు సంక్రమణ సమయాల్లో, నిషిద్ధ సమయాల్లో, రాత్రి భోజనముచేసి యీ వృక్షాన్ని సేవించరాదు.
మౌనంగా లేదా గురునామము లేదా విష్ణుసహస్ర నామమును చదువుతూ నెమ్మదిగా ప్రదక్షణలు చేయాలి. ప్రతి ప్రదక్షణానికి ముందు అలాగే చివర అశ్వత్ధ వృక్షానికి నమస్కారించాలి.
అశ్వత్ధ వృక్ష పూజా ఫలము..
అశ్వత్ధ వృక్షానికి రెండులక్షల ప్రదక్షణాలు చేస్తే సర్వపాపాలూ నశించి నాలుగుపురుషార్ధాలు సిద్ధిస్తాయి.
బిడ్డలు కలగాలన్న సంకల్పముతో ప్రదక్షణలు చేస్తే తప్పక కలుగుతారు.
శనివారంనాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితో తాకి మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే మృత్యుభయం పోతుంది. అలాగే శనివారంనాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితోతాకి ఈ క్రింది శనైశ్చర స్తోత్రమును పఠించిన శనిదోషం తొలగిపోతుంది.
అశ్వత్ధ వృక్షం క్రింద చెప్పవలసిన శనైశ్చర స్తోత్రం..
కోణస్థ: పింగళో బభ్రు: కృష్ణో రౌద్రాంతకోయమః
శౌరీ శ్శనైశ్చరో మందః పిప్పిల దేవ సంస్తుతః
గురువారం, అమావాస్య కలసి వచ్చినరోజున అశ్వత్ధ వృక్షం క్రింద వేదవిప్రునికి భోజనము పెడితే కోటిమంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితముంటుంది.
గురువారం, అమావాస్య కలసి వచ్చినరోజున అశ్వత్ధ వృక్షనీడలో స్నానమాచరించిన మహాపాపములు తొలగును.
అశ్వత్ధ వృక్షం క్రింద చదివిన గాయత్రి మంత్రజపం నాలుగు వేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తుంది. అశ్వత్ధ వృక్షాన్ని స్థాపిస్తే నలభైరెండు తరాలవారికి స్వర్గం లభిస్తుంది.
లోకా సమస్తా సుఖినో భవంతు..!!
శ్రీ మాత్రే నమః

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts